Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేయాలని పలువురు రెజ్లర్లు గత కొంత కాలంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇటీవల బ్రిజ్ భూషన్ పై చర్యలను కోరుతూ రెజ్లర్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే సమస్యలు పరిష్కారం అయితేనే తనతో సహా రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ ఆసియా క్రీడల్లో పాల్గొంటామని ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ శనివారం తెలిపారు.
Read Also: Karnataka High Court: అనుమానంతో భార్య, పిల్లల హత్య.. చనిపోయేదాకా ఉరితీయాలని కోర్టు తీర్పు..
డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌పై కేసు ఛార్జిషీట్‌ను ప్రస్తావిస్తూ, రెజ్లర్ బజరంగ్ పునియా మాట్లాడుతూ, జూన్ 15 లోపు చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పామని ఆయన తెలిపారు. ఇటీవల అనురాగ్ ఠాకూర్ తో సమావేశం అయ్యారు రెజ్లర్లు. బుధవారం జరిగిన ఈ సమావేశంలో జూన్ 15లోగా ఛార్జిషీట్ దాఖలు చేస్తారని అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. జూన్ 30లోగా డబ్ల్యుఎఫ్‌ఐ ఎన్నికలు నిర్వహిస్తామని రెజ్లర్లకు చెప్పారు. కేంద్రమంత్రి హామీ మేరకు జూన్ 15 వరకు నిరసనలను విరమించారు రెజ్లర్లు.
ఈ కేసులో బ్రిజ్ భూషణ్ పై విచారణ ప్రారంభం అయింది. శుక్రవారం రెజ్లర్ సంగీతా ఫోగట్ ను ఢిల్లీ పోలీసులు సీన్ రీ క్రియేట్ చేయడానికి బ్రిజ్ భూషణ్ ఇంటికి తీసుకెళ్లారు. బ్రిజ్ శరణ్ తన కండబలం, రాజకీయ బలాన్ని ఉపయోగిస్తూ మహిళా రెజ్లర్లను వేధిస్తున్నాడని, అతడిని అరెస్ట్ చేయాల్సిందే అని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. మహిళా రెజ్లర్లు డబ్లూఎఫ్ఐతో రాజీకి వెళ్లారని వస్తున్న వార్తలను రెజ్లర్లు ఖండించారు. ఈ కేసు విచారణపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేశారు. వచ్చే వారంలోగా కోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.