Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ గౌరవించడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అయోధ్యంలో శ్రీరాముడి జన్మస్థలంలో రాముడి ఆలయం వచ్చేదా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో ఈ నెల 17న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ తరుపున యోగి ప్రచారం చేశారు. ఎంపీలోని పావై, అశోక్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
500 ఏళ్ల నిరీక్షణ తర్వాత అయోధ్యంలో భారీ ఆలయ నిర్మాణం పూర్తవుతోందని యోగి అన్నారు. బీజేపీ పాలనలో ప్రకృతి వైపరీత్యం తర్వాత కేదార్‌నాథ్ ధామ్, ఉజ్జయినిలోని మహాకాల్ లోక్, వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయాలను పునరుద్ధరించామని యూపీ సీఎం తెలిపారు. కాంగ్రెస్ అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పని చేయనప్పుడు వారిని ప్రజలు ఎందుకు భరించాలని అడిగారు. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, కాంగ్రెస్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే రామమందిరం వంటి సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీకి అభినందనల వెల్లువ.. ప్రధాని మోడీ, సచిన్ ట్వీట్స్..
ఉగ్రవాదం, నక్సలిజం, వేర్పాటువాదం వంటి సమస్యలకు కాంగ్రెస్‌దే బాధ్యత అని, బిజెపి ప్రభుత్వం వాటిని పరిష్కరించిందని, ఈ సమస్యలు కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో రాజకీయాలతో ముడిపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేకపోవడంతో హోలీ, దీపావళి వంటి పండుగల సమయంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితుల కారణంగా భయానక వాతావరణం నెలకొందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కులాల పేరుతో ప్రజలను విభజించడం ద్వారా సామాజిక స్వరూపాలన్ని చీల్చివేసిందని యోగి ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలు ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడల్లా, ఆ పార్టీ నాయకులు దేశంలోని వనరులపై ముస్లింలకు మొదటి హక్కు అని చెప్పేవారని, వారు పేదలు, రైతులు, యువత, మహిళలను పట్టించుకునే వారు కాదని విమర్శించారు. ప్రధాని మోడీ, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ని అభివృద్ధి మార్గంలో ఉంచారని, గత కాంగ్రెస్ పాలనతో బీమారు రాష్ట్రంగా పిలిచే వారని అన్నారు.