Srilanka: చైనాతో తమకు ఎలాంటి సైనిక ఒప్పందాలు లేవని శ్రీలంక తటస్థంగా ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే అన్నారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశానికి వ్యతిరేఖంగా ఎప్పటికీ వాడుకోనివ్వం అని ఆయన స్పష్టం చేశారు. ఒక టెలివిజన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో చైనా సైన్యం ఉందనే ఆరోపణల్ని కొట్టిపారేశారు. తాము తటస్థంగా ఉంటామని తెలిపారు. యూకే, ఫ్రాన్స్ లో అధికారికంగా పర్యటిస్తున్న విక్రమసింఘే, ఫ్రాన్స్ ప్రభుత్వ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: World Bank: ఛత్తీస్‌గఢ్ పాఠశాలల కోసం ప్రపంచ బ్యాంకు భారీ రుణం
తమది తటస్థ దేశమని, అయితే భారత్ పై ఎలాంటి బెదిరింపులకు శ్రీలంకను స్థావరంగా ఉపయోగించుకోవడాన్ని మేం అనుమతించమని ఆయన అన్నారు. తమ దేశంలో చైనీయులు కొన్ని శతాబ్ధాలుగా ఉంటున్నారని.. అయితే చైనా సైనిక ఉనికి లేదని, హంబన్‌టోటాలో చైనా ఉనికి గురించి వచ్చిన నివేదికలను కేవలం ఊహాగానాలు అని పేర్కొన్నారు. హంబన్‌తోట నౌకాశ్రయాన్ని చైనా వ్యాపారులకు ఇచ్చినప్పటికీ, దాని భద్రత శ్రీలంక ప్రభుత్వమే నియంత్రిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సదరన్ నావల్ కమాండ్ హంబన్ టోటకు మార్చబడుతుందని వెల్లడించారు.
గతేడాది సైనిక నిఘా నౌక యువాన్ వాంగ్-5 హంబన్ టోట నౌకాశ్రయంలోకి వచ్చింది. ఇది బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ, ఉపగ్రహ ట్రాకింగ్ షిప్. ఆ సమయంలో భారత్ పై నిఘా పెట్టేందుకే ఇది హంబన్ టోటకు వచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. ముందుగా యువాన్ వాంగ్ -5 అనుమతి ఇచ్చేందుకు శ్రీలంక అభ్యంతరం చెప్పినా.. చైనా ఒత్తిడితో డాకింగ్ కు అనుమతి ఇచ్చింది. వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రం భారత్ కు అత్యంత కీలకం. అయితే ఈ ప్రాంతంలో చైనా తన ఆధిక్యతను పెంచుకోవాలని చూస్తోంది. అంతకుముందు శ్రీలంక 2014లో చైనా అణు జలంతర్గామిని తన ఓడ రేవులో డాక్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో ఇండియా-శ్రీలంకల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.