Matrimonial Fraud: మ్యాట్రిమోనీ సైట్లను నమ్ముకుని మోసపోతున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తప్పుడు మాటలు చెప్పడం, మహిళల్ని నమ్మించడం చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా పూణేకు చెందిన ఓ మహిళ రెండో వివాహం కోసం చూస్తే, ఆమెకు మొదటి భర్త ద్వారా వచ్చిన భరణం డబ్బుల్ని మోసపోవాల్సి వచ్చింది. మోసం చేసని వ్యక్తిని పూణే సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
డాక్టర్ రోహిత్ ఒబెరాయ్ అనే ఆస్త్రేలియా డాక్టర్‌గా నటిస్తూ, ఉత్తర్ ప్రదేశ్ లక్నోకు చెందిన అభిషేక్ శుక్లా ఏకంగా మహిళ దగ్గర నుంచి రూ. 3.6 కోట్ల డబ్బును మోసం చేశాడు. పూణేలోని ఖరాడి ప్రాంతంలో నివసిస్తున్న బాధితురాలు మాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసింది. నిందితుడు శుక్లా పన్నిన ఉచ్చులో పడింది. 2023లో భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ పౌరుడిగా డాక్టర్ రోహిత్ ఒబెరాయ్ అని చెప్పుకునే వ్యక్తి బాధిత మహిళను సంప్రదించాడు. కాలక్రమేణా, ఇద్దరూ సన్నిహిత సంబంధాలను పెంచుకున్నారు. పూణేతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో వేర్వేరు ప్రదేశాల్లో కలిసి నివసించారు.
అయితే, సదరు మహిళ తన మొదటి భర్త నుంచి విడాకుల సమయంలో రూ. 5 కోట్లు భరణంగా పొందింది. జీవనోపాధి కోసం ఒక పాఠశాల కోసం మైండ్‌ఫుల్‌నెస్, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించింది. ఆమె సంపద గురించి తెలుసుకున్న నిందితుడు, ఆమె వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరిస్తానని మయామాటలు చెప్పి, ఆమె దగ్గర నుంచి నిధులు కొల్లగొట్టడం ప్రారంభించాడు.
Read Also: Jagannath Rath Yatra: జై జగన్నాథ్.. కనులవిందుగా పూరి రథయాత్ర.. మంత్రముగ్ధులను చేసే ఫోటోలు..
సింగపూర్‌లో నివసిస్తున్నట్లు చెప్పుకునే ఎవాన్, విన్సెంట్ కువాన్ అనే సహచరుల నకిలీ గుర్తింపును ఉపయోగించి, నిందితుడు సదరు మహిళ నుంచి సింగపూర్ బ్యాంక్, అనేక భారతీయ బ్యాంకుల ఖాతాల ద్వారా రూ. 3.6 కోట్లు బదిలీ చేసేలా మోసం చేశాడు. నిందితుడు దీని తర్వాత తనకు నోటి క్యాన్సర్ వచ్చిందని చెప్పుకుంటూ, బాధిత మహిళకు దూరం కావడం ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2024లో బాధిత మహిళకు డాక్టర్ ఒబెరాయ్ మరణించాడని విన్సెంట్ కువాన్ నుంచి ఈమెయిల్ వచ్చింది. అయితే, ఒక స్నేహితుడిని సంప్రదించిన తర్వాత ఇది మోసం కావచ్చని మహిళకు చెప్పాడు. ఆ తర్వాత విచారణలో భారీ మొత్తంలో తాను మోసానికి గురైనట్లు మహిళ కనుక్కుంది. పోలీసుల విచారణలో నిందితుడు డాక్టర్ ఒబెరాయ్ కాదని, అభిషేక్ శుక్లా అని తేలింది.
అధికారులు అతడిపై లుకౌంట్ సర్య్కులర్ జారీ చేశారు. జూన్ 25, 2025న, సింగపూర్ నుండి వచ్చిన తర్వాత ముంబై విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. పోలీసుల దర్యాప్తులో శుక్లా మ్యాట్రిమోనియల్ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌లను ఉపయోగించి 3,000 మందికి పైగా మహిళలను సంప్రదించాడని తేలింది. వివాహం పేరుతో అతను ఇంకా చాలా మంది వ్యక్తులను మోసం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు, తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.