Delhi HC: లవ్ ఫెయిల్యూర్‌తో ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటే దానికి మహిళను బాధ్యులు చేయలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆత్మహత్యకు ప్రేరేపించారనే కేసులో ఇద్దరు వ్యక్తుల ముందస్తు అరెస్ట్ నుంచి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. ‘‘బలహీనమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి తీసుకున్న నిర్ణయానికి మరో వ్యక్తిని నిందించలేము’’ అని కోర్టు పేర్కొంది.
‘‘ప్రేమ వైఫల్యం కారణంగా ప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడితే, పరీక్షలో ఫెయిల్ అయిన కారణంగా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే, ఒక కేసు గెలిపించలేదని క్లయింట్ ఆత్మహత్యకు పాల్పడితే ఆ మహిళను, ఎగ్జామినర్‌ని, లాయర్ని ఆత్మహత్యకు సహకరించారని భావించలేము’’ అని జస్టిస్ అమిత్ మహాజన్ అన్నారు. 2023లో వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణపై ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్న ఒక మహిళ, ఆమె స్నేహితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అమిత్ మహాజన్‌తో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Russia-Ukraine War: ఉక్రెయిన్‌తో యుద్ధంలో 50,000 రష్యన్ సైనికులు మృతి
వ్యక్తి తండ్రి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. సదరు మహిళ తన కొడుకుతో గతంలో రొమాంటిక్ రిలేషన్షిప్ కలిగి ఉందని ఆరోపించారు. ఆమె మరో వ్యక్తితో శారీరక సంబంధాన్ని కలిగి ఉందని, త్వరలో పెళ్లి చేసుకుంటామని చెప్పి తన కొడుకు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ ఇద్దరి వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతుడు సూసైడ్ నోట్ రాశాడు.
మృతుడు తన సూసైడ్ నోట్లో వారి పేర్లు పేర్కొనడం సరైనదేనని, అయితే మృతుడి ఆత్మహత్య చేసుకునేలా బెదిరించేలా ఇందులో ఏం లేదని హైకోర్టు పేర్కొంది. ఆ సూసైడ్ నోట్ కేవలం మరణించిన వ్యక్తి ఆవేదన మాత్రమే వ్యక్తం చేసిందని, అయితే అతని ఆత్మహత్యకు దారి తీసే విషయాలు లేవని పేర్కొంది. మృతుడు సున్నిత మనస్కుడని, తనతో మాట్లాడకుంటే ఆత్మహత్య చేసుకుంటానని మహిళను నిరంతరం బెదిరించే వాడని కోర్టు పేర్కొంది. నిందితులుగా పేర్కొంటున్న ఇద్దర్ని కస్టడీలో విచారించే అవసరం లేదని బెయిల్ మంజూరు చేస్తూ, విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఎవరైనా బెయిల్ షరతులు ఉల్లంఘించిన పక్షంలో బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసే స్వేచ్ఛ ఉందని పేర్కొంది.