Winter session of Parliament from December 7: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారు అయింది. డిసెంబర్ 7 నుంచి 29 వరకు సమావేశాలు జరగనున్నాయి. 23 రోజుల పాటు 17 సమావేశాలు జరగనున్నట్లు కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం వెల్లడించారు. 23 రోజుల్లో 17 రోజులు పార్లమెంట్ సమావేశాలు ఉండనున్నాయి. రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ మొదటిసారిగా రాజ్యసభ సమావేశాలను నిర్వహించనున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల జరుగుతున్న క్రమంలో శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Read Also: Kerala: కేరళలో మోడల్‌పై గ్యాంగ్ రేప్.. కదులుతున్న కారులో అఘాయిత్యం
పార్లమెంట్ సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చ కోసం ఎదురు చూస్తున్నామని.. వివిధ అంశాలపై చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. సమావేశాల తొలిరోజున మరణించిన సభ్యులకు నివాళులు అర్పించే అవకాశం ఉంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం పలు బిల్లులను ఆమోదించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇదే విధంగా దేశంలో ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితులపై ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది.
దీంతో పాటు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఏజెన్సీలైన సీబీఐ, ఈడీ, ఐటీలను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పుతున్నాయని వివిధ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై కూడా ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమిఫైనల్ గా భావిస్తున్న హిమాచల్, గుజరాత్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నిలకు సంబంధించి పోలింగ్ ముగిసింది, డిసెంబర్ 1,5 తేదీల్లో గుజరాత్ పోలింగ్ జరగనుంది. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి. దీంతో పాటు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నగారా కూడా మోగింది. ఈ క్రమంలో శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి.