Sharad Pawar: దేశంలో మార్పు పవనాలు బలంగా వీస్తున్నాయని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ తన కంచుకోట అయిన కస్బాపేత్ అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయింది. దీనిపై మాట్లాడుతూ శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కస్బా పేత్ ఓటమితో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని స్పష్టమైందని ఆయన అన్నారు. దాదాపుగా మూడు దశాబ్ధాలుగా పూణేలోని ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉంది.
తాజా జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర ధంగేకర్, బీజేపీ అభ్యర్థి హేమంత్ రసానేపై విజయం సాధించారు. కాంగ్రెస్, ఎన్సీపీ, ఉద్దవ్ ఠాక్రే కూటమి ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించింది. గత 28 ఏళ్లుగా కస్బాపేత్ నియోజకవర్గంలో బీజేపీనే విజయం సాధిస్తూ వస్తోంది. పూణే నుంచి బీజేపీ లోక్ సభ ఎంపీగా ఉన్న గిరీష్ బాపట్ 2019 వరకు 5 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
Read Also: Russia: వచ్చే ఏడాది నాటికి రష్యా ఖజానా ఖాళీ.. హెచ్చరించిన రష్యన్ ఒలిగార్చ్..
ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్నాటక రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉందని, ఓట్లు వేసే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ ఎలా పడగొట్టిందో ప్రజలు గుర్తుంచుకుంటారని శరద్ పవార్ అన్నారు. ఎన్నికల కమీషనర్ల(ఈసీ)ల నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి మంచి నిర్ణయం అని పవార్ అన్నారు.
ప్రధాన మంత్రి, లోక్ సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులతో కూడిన కమిటీ సిఫార్సు మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీల నియామకాన్ని రాష్ట్రపతి చేస్తారని సుప్రీంకోర్టు గురువారం ఓ తీర్పునిచ్చింది. ఎన్నికల ప్రక్రియని పారదర్శకంగా నిర్వహించడానికి ఈ ప్రక్రియ అవసరం అని సుప్రీంకోర్టు పేర్కొంది.