Russia Might Run Out Of Money: స్నేహపూర్వక దేశాల నుంచి పెట్టుబడులు రాకపోతే వచ్చే ఏడాది రష్యా దగ్గర డబ్బు లేకుండా పోతుందని, రష్యా ఖజానా ఖాళీ అవుతుందని రష్యాలో పవర్ ఫుల్ వర్గం రష్యన్ ఒలిగార్చ్ హెచ్చరించారు. సైబీరియాలో జరిగిన ఆర్థిక సదస్సులో రష్యన్ ఒలీగార్చ్ ఒలేగ్ డెరిపాస్కా ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో మాస్కో యుద్ధాన్ని ముగించాలని బిలియనీర్లు పిలుపునిచ్చారు. పాశ్చాత్య ఆంక్షల కారణంగా రష్యా ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో ఉందని అన్నారు. రష్యా ఈ నెలలో చమురు ఉత్పత్తిని తగ్గిస్తుంది, పాశ్చాత్య ఆంక్షలు మరింత కఠినతరం కావచ్చు, అంతిమంగా రష్యా యొక్క ఆర్థిక అవకాశాలును ఉక్రెయిన్ పరిణామాలు నిర్ణయిస్తాయని ఒలేగ్ డెరిపాస్కా అన్నారు.
Read Also: Jagga Reddy : సీఎం కేసీఆర్కు లేఖ రాసిన జగ్గారెడ్డి.. పార్టీ మారుతారంటూ ప్రచారం
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుండి, పాశ్చాత్య దేశాలు 11,300 కంటే ఎక్కువ ఆంక్షలు విధించాయి మరియు రష్యా యొక్క 300 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను స్తంభింపజేసాయి. అయినప్పటికీ, చైనా, ఇండియా వంటి దేశాలు రష్యాతో వ్యాపారం చేయడంతో పరిస్థితి నయంగా ఉంది. పాశ్చాత్యదేశాల నుంచి ఆంక్షలు వస్తున్నా వాటిని ధిక్కరించి ఈ రెండు దేశాలు రష్యా నుంచి ఆయిల్, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తున్నాయి. ఆంక్షల కారణంగా కోల్పోయిన ఎగుమతి డబ్బు, ఇతర ఆదాయ వనరులను తిరిగి పొందాలంటే రష్యా చాలా దూరం వెళ్లాల్సి ఉంది.
అయితే అంతకుముందు రష్యాపై వెస్ట్రన్ దేశాలు విధించిన ఆంక్షల నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరిస్తున్నందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. పుతిన్ వ్యాఖ్యల తర్వాత ఒలిగార్చ్ డెరిపాస్కా తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రష్యా ఆర్థిక ఉత్పత్తి గత ఏడాది 2.1 శాతం పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే జనవరిలో దేశ ఆదాయం 35 శాతం క్షీణించగా, దాని ఖర్చులు 59 శాతం పెరిగాయి. ఇది సుమారు 23.3 బిలియన్ డాలర్ల బడ్జెట్ లోటుకు దారితీసింది. శుక్రవారం వెలువడిన డేటా ప్రకారం రష్యా నుంచి యూరోపియన్ యూనియన్(ఈయూ) దిగుమతుల విలువ గతేడాది ఫిబ్రవరి-డిసెంబర్ మధ్య 51 శాతం తగ్గాయి. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు ఈయూ రష్యా ప్రధాన వాణిజ్య భాగస్వాముల్లో ఒకటిగా ఉండేది.