Sheikh Hasina: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మాజీ ప్రధాని షేక్ హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని చెబుతూ కేసులు నమోదు చేసింది. గతేడాది జరిగిన విద్యార్థులు హింసాత్మక నిరసనల్లో, షేక్ హసీనా బలవంతంగా ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిందని, బలప్రయోగం ద్వారా పలువురి మరణాలకు కారణమైందని చెబుతూ, బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణశిక్షను విధించింది.
ఐదు ఆరోపణలపై హసీనాను దోషిగా తేల్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ,హెలికాప్టర్లు, డ్రోన్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించి విద్యార్థి నిరసనకారులను నిర్మూలించాలని ఆదేశించినందుకు శిక్షల్ని ఖరారు చేసింది. గత ఏడాది ఆగస్టు 5న ఢాకాలోని చంఖర్‌పుల్ ప్రాంతంలో ఆరుగురు నిరసనకారులను కాల్చి చంపిన ఆరోపణలపై ఆమెకు మరణశిక్ష విధించబడింది.
అయితే, గతేడాది హింసాత్మక దాడుల తర్వాత షేక్ హసీనా భారత్ పారిపోయి వచ్చింది. ఇప్పుడు, దోషిగా తేలి శిక్షలు ఖరారయ్యాయి. ఆమెను తమకు అప్పగించాలని భారత్‌ను బంగ్లాదేశ్ కోరుతోంది. ఆమెతో పాటు అప్పటి హోం మంత్రి అసదుద్జమాన్ ఖాన్ కమల్‌ను కూడా అప్పగించాలని కోరింది. అన్ని నేరాలకు హసీనా కారణమని చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం అన్నారు. అయితే, ఈ ఆరోపణలు అన్యాయమని హసీనా తోసిపుచ్చారు.
ఈ ఇద్దరు దోషుల్ని భారత్ తమకు అప్పగించాని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో కోరింది. బంగ్లా-భారత్ మధ్య ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందంలో భాగంగా దోషుల్ని తప్పనిసరిగా అప్పగించాల్సి వస్తుందని పేర్కొంది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులకు ఆశ్రయం కల్పించడం స్నేహానికి, న్యాయం పట్ల నిర్లక్ష్యంగా పరిగణించబడుతుందని పేర్కొంది. హసీనాకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై భారత్ స్పందించింది. బంగ్లాలో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం పరిగణలోకి తీసుకుని అందరితో చర్చించి నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని భారత్ బంగ్లాదేశ్‌కు హామీ ఇచ్చింది.
భారత్ హసీనాను అప్పగిస్తుందా.?
భారత్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించే అవకాశం చాలా తక్కువ. ముఖ్యంగా ఈ అభ్యర్థన రాజకీయంగా ప్రేరేపించబడినదిగా, అన్యాయమైందిగా భావించినప్పుడు భారత్ అప్పగించాల్సిన అవసరం లేదు. భారత్ – బంగ్లా మధ్య 2013లో సరిహద్దుల్లో తిరుగుబాటు, ఉగ్రవాదాన్ని పరిష్కరించడానికి వ్యూహాత్మక చర్యగా అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2016లో రెండు దేశాలు పారిపోయిన వ్యక్తుల మార్పిడి సులభతరం చేయడానికి ఒప్పందాన్ని సవరించాయి. అయితే, ఒక వ్యక్తిని అప్పగించాలంటే రెండు దేశాల్లో కూడా ఆ నేరం శిక్షార్హంగా ఉండాలి. ద్వంద్వ నేరం అనే సూత్రం ద్వారా ఈ ఒప్పందం జరిగింది.
హసీనాపై వచ్చిన అభియోగాలను భారత చట్టాలతో సరిపోయే నేరాలుగా భావించకుండా, ఆమెను అప్పగించేందుకు నిరాకరించవచ్చు. నిందితులపై అన్యాయంగా, అణిచివేతలో భాగంగా తీర్పు వెల్లడిస్తే, ఆ వ్యక్తిని అప్పగింతను తిరస్కరించవచ్చని ఒప్పందంలోని ఆర్టికల్ 8 చెబుతోంది. హసీనాపై అభియోగాలు కక్ష కారణంగా మోపారని, ఆమెను రాజకీయ హింసకు గురి చేస్తున్నారని భావిస్తే భారత్ ఆమెను అప్పగించకపోవచ్చు. ఒప్పందంలోని ఆర్టికల్ 6 కూడా ‘‘రాజకీయ స్వభావం’’ కలిగి ఉంటే, అప్పగింతను తిరస్కరించవచ్చని సూచిస్తోంది. దీంతో పాటు, 1962 నాటి అప్పగింతల చట్టం, భారత ప్రభుత్వానికి అప్పగింతను తిరస్కరించే, చర్యల్ని నిలిపేయడానికి అధికారాన్ని ఇస్తుంది.