Kangana Ranaut: జ్యోతిర్మఠ్ శంకరాచార్యులు అవిముక్తేశ్వరానందర సరస్వతి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. ఏక్‌నాథ్ షిండేకి మద్దతుగా నిలబడ్డారు. శివసేన(యూబీటీ)నేత ఉద్ధవ్ ఠాక్రేకి, ఏక్ నాథ్ షిండే ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. హిందూ మత సిద్ధాంతాల్లో ద్రోహాన్ని అతిపెద్ద పాపంగా పరిగణిస్తారని, ద్రోహం చేసేవారు ఎప్పటికీ హిందువులు కాలేదరని ఆయన అన్నారు. సీఎం పదవి నుంచి ఉద్ధవ్ ఠాక్రేని దించడాన్ని ఆయన ప్రస్తావించారు.
Read Also: Gudivada Amarnath: రాష్ట్రంలో దాడులు, హత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలి..
ఉద్ధవ్ ఠాక్రేకి జరిగిన ద్రోహం గురించి ప్రజలు బాధపడుతున్నారని, ఆయన మళ్లీ సీఎం అయ్యే వరకు వారి బాధ తీరదని అవిముక్తేశ్వరానంద అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ విషయం రుజువైందని చెప్పారు. ‘‘ద్రోహాన్ని సహించలేము. ప్రభుత్వాన్ని మధ్యలో కూల్చేయడం, ప్రజాతీర్పును అవమానించడం ఆమోదయోగ్యం కాదు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, కానీ హిందూ మతం అలాంటి ద్రోహాన్ని అంగీకరించదు’’ అని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 ఎంపీ స్థానాల్లో బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్)ల మహాయుతి కూటమి 17 సీట్లను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్-శివసేన(ఠాక్రే)-ఎన్సీపీ(శరద్ పవార్)ల మహా వికాస్ అఘాడీ 30 స్థానాలను కైవసం చేసుకుంది.
అయితే, ఆయన వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఘాటుగానే స్పందించారు. ఒక రాజకీయ నాయకుడు రాజకీయాలు చేయకుంటే గోల్‌గప్ప(పానీ పూరి) అమ్ముతాడా..? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో పొత్తులు, ఒప్పందాలు, పార్టీల విభజన చాలా సాధారణం, రాజ్యాంగబద్ధమైనందని ఆమె అన్నారు. శంకరాచార్య జీ తన పదాలను, ప్రభావాన్ని, మతపరమైన విద్యను దుర్వినియోగం చేశారని అన్నారు. ‘‘ రాజు స్వయంగా తన ప్రజలను దోపిడీ చేయడం దేశద్రోహమే అని మతం చెబుతుంది’’ అని ఆమె అన్నారు. ఏక్‌నాథ్ షిండేను ద్రోహిగా పేర్కొని మనందరి మనోభావాలను శంకరాచార్య దెబ్బతీశారని అన్నారు. శంకరాచార్య జీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి హిందూ మతం గౌరవాన్ని కించపరుస్తున్నారని విమర్శించారు.