INDIA Bloc: ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి, ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమి పేరుతో ఏకమయ్యాయి. కూటమి పెట్టిన సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కూడా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ, బెంగాల్ పార్లమెంట్ సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్-టీఎంసీలకు మధ్య చెడింది. దీంతో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఒకానొక దశలో కాంగ్రెస్‌కి గతంలో వచ్చిన సీట్లు కూడా వస్తాయా..? అని మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు.
Read Also: Magnetic reversal: భూమి “అయస్కాంత ధృవాలు” రివర్స్ అవుతున్నాయి.. ప్రళయం ముంచుకొస్తుందా..?
ఇదిలా ఉంటే ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే విషయంలో తాజాగా మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓడిపోయి, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాము బయట నుంచి మద్దతు ఇస్తామని ఆమె ప్రకటించారు. ప్రతిపక్షం అధికారంలోకి వస్తే ప్రధాని మంత్రి అభ్యర్థిగా పరిగణించవచ్చనే ఊహాగానాల మధ్య ఈ ప్రకటన వచ్చింది. ‘‘మొదటి నాలుగు దశల్లో బీజేపీ ఓడిపోయింది. మిగిలిన మూడింటిలో కూడా గెలిచే అవకాశం లేదు. వారు చాలా సందడి చేస్తారు, అయినా గెలవలేరు. చాలా మంది పెద్దపెద్ద లెక్కలు వేస్తున్నారు. నేను ఢిల్లీ గురించి మాట్లాడుతున్నాను. మేము ఇండియా కూటమికి బయట నుంచి అన్ని విధాల సహాయం అందిస్తాము’’ అని ఆమె అన్నారు.
ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా నిలిచిన మమతా బెనర్జీ, ఆ తర్వాత సీట్ల పంపకాలలో కాంగ్రెస్‌తో పొసగలేదు. ఇటీవల ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్, సీపీఎం సహకరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. అయితే ఢిల్లీ విషయానికి వస్తే మాత్రం తాము ఇండియా కూటమికి బయట నుంచి అన్ని రకాల సాయం చేస్తామని అన్నారు. కూటమి 300 సీట్ల కంటే ఎక్కువగా గెలుచుకుని తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.