Chandrayaan-3: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 మిషన్ నిర్వహించబోతోంది. రేపు ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 జాబిల్లి వైవపు ప్రయాణించనుంది. ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే చంద్రయాన్-2లో జరిగిన తప్పులు మళ్లీ పునారావృతం కాకుండా శాస్త్రవేత్తలు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వైఫల్యాన్నే విషయంగా మార్చుకునేందుకు ఇస్రో చంద్రయాన్-3 ప్రారంభించింది. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ దిగితే, ఈ ఘటన సాధించిన అతికొన్ని దేశాలైన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ సగర్వంగా నిలబడుతుంది.
అయితే ఈ నేపధ్యంలో 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగం, దాని వైఫల్యం మరోసారి వార్తల్లో నిలుస్తోంది. 130 కోట్ల మంది భారతీయులు 2019, సెప్టెంబర్7న ఊపిరి బిగపట్టుకుని విక్రమ్ ల్యాండర్, అందులోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగాలని అంతా అనుకున్నారు. ఎన్నో ప్రమాకరమైన దశల్ని దాటుకుని చంద్రుడికి చేరువ అవుతున్న క్రమంలో కేవలం జాబిల్లి ఉపరితలానికి 400 మీటర్ల దూరంలో ల్యాండర్ నుంచి భూమిపై ఉన్న మిషన్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలింది.
వైఫల్యానికి కారణాలు ఇవే:
దాదాపుగా 40కి పైగా రోజులు ప్రయాణించి చంద్రయాన్-2 చంద్రుడిని చేరింది. ఆర్బిటార్ నుంచి వేరుపడిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి చుట్టూ తిరుగుతూ.. క్రమక్రమంగా కక్ష్యను తగ్గించుకుంటూ వచ్చింది. దీని కోసం ల్యాండర్ లో ఉన్న మోటార్లను మండిస్తూ, చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా వచ్చింది. అయితే ల్యాండర్ దిగుతున్న సమయంలో నిర్దేశించిన 55 డిగ్రీల వంపుకు బదులుగా 410 డిగ్రీలు వంగడంతో ప్రమాదం జరిగింది. ఈ దశలో రోవర్ తనకు తానుగా అన్ని కార్యక్రమాలు నిర్వహించుకునేలా ప్రోగ్రాం చేయబడింది. ఒక వేళ దిగే మార్గంలో కాస్త తప్పినా కూడా సరిచేసుకునే విధంగా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం చేశారు. అయితే 400 మీటర్ల దూరంలో విక్రమ్‌తో ఇస్రో సంబంధాలు కోల్పోయినట్లు ఏజెన్సీ తెలిపింది.
ఎక్కడ తప్పు జరిగింది..?
చంద్రుడి వైపు ల్యాండర్ దిగుతున్న సమయంలో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ల్యాండర్ ను గంటలకు 6000 కిలోమీటర్ల వేగంతో తన వైపు లాగుతుంది. అయితే నాలుగు దశల్లో గంటకు 6000 కిలోమీటర్ల నుంచి 0 కిలోమీటర్లకు తీసుకురావడం పెద్ద టాస్క్. పలు దశల్లో ల్యాండర్ లో ఉన్న ఇంజిన్లను మండిస్తూ వేగాన్ని తగ్గిస్తారు. అయితే అనుకున్న కోణంలో ల్యాండర్ లేకపోవడంతో వేగం ఎక్కువ ఉండటం ల్యాండర్ కుప్పకూలింది. సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయాయి. దిగుతున్న మార్గంలో మార్పు, వేగాన్ని నియంత్రించలేకపోవడంతో విక్రమ్ ల్యాండర్, అందులోని రోవర్ ప్రజ్ఞాన్ ధ్వంసమయ్యాయి.
చంద్రయాన్ 3 మిషన్ ఫెయిల్యూర్ బెస్డ్ మాడ్యూల్‌తో రూపొందించబడింది, ఇందులో సాధ్యమయ్యే అన్ని వైఫల్యాలు మరియు వాటి దిద్దుబాట్లు పరిగణనలోకి తీసుకోబడ్డాయి. చంద్రయాన్-2 ల్యాండింగ్ ఏరియా పోలిస్తే చంద్రయాన్ 3లో ల్యాండిగ్ ఏరియా 2.5 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్లకు పెంచారు.