Ajit Doval: భారత జాతీయ భద్రత సలహాదారు(NSA) అజిద్ దోవల్ తన రోజూవారీ పనుల్లో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ఉపయోగించనని వెల్లడించారు. ‘‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక యువకుడు.. ‘‘మీరు నిజంగా మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వాడరా?’’ అని దోవల్‌ను ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ‘‘నేను ఇంటర్నెట్ వాడను, మొబైల్ ఫోన్ కూడా చాలా అరుదుగా మాత్రమే ఉపయోగిస్తాను. కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సినప్పుడు లేదా విదేశాల్లో ఉన్న వ్యక్తులతో అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ వాడుతాను’’ అని చెప్పారు.
Read Also: Iran Protests: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ఇజ్రాయిల్ హైఅలర్ట్..
తన పని నిర్వహణకు సంబంధించి ఇతర భద్రమైన కమ్యూనికేషన్ మార్గాలు ఉన్నాయని, అవి సాధారణ ప్రజలకు తెలియవని దోవల్ చెప్పారు. జాతీయ భద్రత వంటి సున్నితమైన అంశాల్లో డిజిటల్ పరికరాల ఉపయోగం ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో దోవల్ వీటికి దూరంగా ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు పదవిని చేపట్టిన ఐదో వ్యక్తి దోవల్. కేరళ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దశాబ్ధాల నుంచి గూఢచార, అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధక కార్యక్రమాల్లో పనిచేశారు.
1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన దోవల్ 1968లో ఐపీఎస్ అధికారిగా చేరారు. ఆయన ధైరసాహసాలకు ప్రతిష్టాత్మక కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును చిన్న వయసులో అందుకున్న పోలీస్ అధికారిగా రికార్డ్ క్రియేట్ చేశారు. దోవల్ తన కెరీర్‌లో మిజోరాం, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటు కార్యక్రమాలను అణిచివేయడంలో పనిచేశారు. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో కీలక పాత్ర పోషించారు. డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనాతో కఠినంగా వ్యవహరించారు. ఇదే కాకుండా 1999లో ఐసీ-814 విమానం హైజాక్ సమయంలో భారత ప్రభుత్వం తరుపున ఉగ్రవాదులతో చర్చలు జరిగే బృందంలో దోవల్ ఉన్నారు.