అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందనగా, హఠాత్తుగా ముఖ్యమంత్రి విజయ్ రూపానిని రాజీనామా చేయమని బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వం ఆదేశించడం రాజకీయ వ్యూహమే అంటున్నారు. గతంలో, 2016 లో కూడా, 16 నెలలు ముందుగా ముఖ్యమంత్రి గా ఆనందిబెన్ పటేల్ ను రాజీనామా చేయాలని ఆదేశించింది అధికార బీజేపీ అగ్రనాయకత్వం. గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ఉన్న, శక్తివంతమైన పటేల్ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశమే బీజేపీ అగ్రనాయకత్వం ప్రస్తుత నిర్ణయానికి ప్రధాన కారణం అని తెలుస్తుంది.
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని “జైన్” మతానికి చెందిన వారు. దీంతో, తదుపరి ముఖ్యమంత్రిగా గుజరాత్ కు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల పేర్లను పరిశీలిస్తుంది బీజేపీ కేంద్ర అగ్ర నాయకత్వం. కేంద్ర మత్స్య, డైరీ, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ ఇద్దరూ పటేల్ వర్గానికి చెందినవారే. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి ఆర్.సి. ఫాల్దు పటేల్ సమాజిక వర్గానికి చెందిన వీరిద్దరి పేర్లు కూడా ముఖ్యమంత్రి పదవికి పరిశీలనలో ఉన్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. వీరి పేర్లే గాకుండా, కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, దాద్రా-నగర్ హవేలి మరియు డామన్-డయూ ల పాలనాధికారి ప్రఫుల్ ఖోడా పటేల్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచరం.
అయితే ఇటీవల లక్షద్వీప్ లో నియమ నిబంధనలను మార్చడంతో, పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కుని వార్తల్లోకి ఎక్కారు ప్రఫుల్ ఖోడా పటేల్. ప్రాణాంతక “కోవిడ్” నిర్వహణ లో కూడా పూర్తి వైఫల్యం చెందారని విజయ్ రూపాని పట్ల సర్వత్రా విమర్శలు వచ్చాయి. విజయ్ రూపాని తర్వాత, తదుపరి ముఖ్యమంత్రి “పాటీదార్” మాత్రమే కావాలన్న డిమాండ్లను ఇటీవల మరింత ఉధృతం చేసారు పటేల్ సమాజిక వర్గ నేతలు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో, “ఆమ్ ఆద్మీ పార్టీ” లాంటి ప్రతిపక్షాలు గుజరాత్ లో క్షేత్ర స్థాయిలో బలం పుంజుకోవడంతో, పటేల్ సమాజిక వర్గం అభిమతాన్ని గౌరవించాలన్నదే బీజేపీ అగ్రనాయకత్వ రాజకీయ వ్యూహం అని తెలుస్తుంది.
ఈ విషయం పై గుజరాత్ బీజేపీ వ్యవహరాల ఇంచార్జ్ భూపేంద్ర యాదవ్, బీజేపీ జనరల్ సెక్రటరీ బి.ఎల్. సంతోష్, ఇరువురు కేంద్ర మంత్రులు మనసుఖ్ మాండవీయ, పురుషోత్తమ్ రూపాలా ముందుగానే సమావేశమయ్యారు. ఆ తర్వాత, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని విజయ్ రూపాని కి తెలియజేసారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా. దాంతో కొత్త నాయకత్వంలో, ప్రధాని మోడి మార్గదర్శనంలో గుజరాత్ రాష్ట అభివృధ్ది కొనసాగాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు విజయ్ రూపాని. అయితే గుజరాత్ లో అధికార బీజేపీ శ్రేణుల నుంచి తీవ్ర అసంతృప్తి ని ఎదుర్కొన్నారు ముఖ్యమంత్రి విజయ్ రూపాని.