ఇంటర్ పరీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ప్రశ్నలు అడగడంపై పంజాబ్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. మార్చి 4 నుంచి పంజాబ్‌లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. అయితే ఈ ప్రశ్నాపత్నంలో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి పలు ప్రశ్నలు వచ్చాయి. ఆప్ ఎప్పుడు స్థాపించబడింది?, దాని విధానాలు, కార్యక్రమాలు ఏంటి? అని ప్రశ్నలు వచ్చాయి. ఈ వ్యవహారం రాజకీయ నాయకులు దృష్టిలో పడింది. దీంతో పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఆప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఉద్దేశ పూర్వకంగానే పరీక్షల్లో ఆప్ గురించి ప్రశ్నలు అడిగారని బీజేపీ యూనిట్ మీడియా చీఫ్ వినీత్ జోషి ధ్వజమెత్తారు.
ఆప్ స్థాపించబడిన సంవత్సరాన్ని అడిగి.. కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చింది. 26 నవంబర్ 2012, 26 జనవరి 2012, 26 డిసెంబర్ 2012, 15 ఆగస్టు 2012 అని ఇచ్చింది. దీని బట్టి చూస్తుంటే ఏడాది పొడవునా ఆప్ గురించే విద్యార్థులకు బోధించినట్లుగా ఉందని జోషి పేర్కొ్న్నారు. పంజాబ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఆప్ ప్రభుత్వం వ్యూహం రచించినట్లుగా ఉందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఆప్ గురించే ఎందుకు అడిగారు.. శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్, ఇతర పార్టీలపై ఎందుకు ప్రశ్నలు అడగలేదని నిలదీశారు. అంటే ఒక పక్షపాత ధోరణితో వ్యవహరించిందని జోషి ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Eega : మళ్ళీ వస్తున్న ‘ఈగ’.. కానీ దర్శకుడు జక్కన్న కాదు
బీజేపీ ఆరోపణలను పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ బెయిన్స్ తోసిపుచ్చారు. ఇంటర్ పరీక్షలను బోర్డు నిపుణులు ఎంపిక చేస్తారని.. ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండదని తెలిపారు. అయినా పొలిటికల్ సైన్స్ పేపర్‌లో రాజకీయ పార్టీల గురించి ప్రశ్నలు అడిగితే తప్పేంటి? అన్నారు. సిలబస్‌లో భాగంగానే ప్రశ్నలు వచ్చి ఉంటాయని మంత్రి చెప్పుకొచ్చారు. గతేడాది జరిగిన పరీక్షలో బీజేపీ, కాంగ్రెస్ గురించి కూడా ప్రశ్నలు వచ్చాయని ఆప్ ప్రతినిధి నీల్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇది కూడా చదవండి: Telegram Update: ఇకపై టెలిగ్రామ్‌లో స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు బ్రేక్.. కొత్త అప్డేట్స్ ఇవే!