IC 814 Hijack: నెట్‌ఫ్లిక్ వెబ్ సిరీస్ ‘‘ IC 814 – కాందహార్ హైజాక్’’ సంచలనంగా మారింది. ఉగ్రవాదుల పేర్లకు బదులుగా హిందూ కోడ్ నేమ్స్ వాడటంతో దీనిపై ఇప్పటికే విమర్శలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉన్నప్పటికీ, ఆనాటి ఘటనను మరోసారి ఈ సిరీస్ భారతీయులకు గుర్తు చేసింది. 1999లో ఖాట్మాండు నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేసి, తాలిబాన్ పాలనలో ఉన్న కాందహార్ తరలించారు. కేవలం రెండు గంటల ప్రయాణం, ఏకంగా 8 రోజుల నిర్బంధం వరకు కొనసాగింది.
ఖాట్మాండు నుంచి డిసెంబర్ 24, 1999 సాయంత్రం 4.53 గంటలకు టేకాఫ్ అయిన విమానాన్ని హైజాక్ చేసి అమృత్ సర్, లాహోర్, దుబాయ్ మీదుగా కాందహార్ తీసుకెళ్లారు. కాందహార్‌లో డిసెంబర్ 25న 8.33గంటలకు విమానం ల్యాండ్ అయింది. ఆ సమయంలో హైజాకర్లకు వేరే వారి నుంచి సందేశాలు వస్తున్నాయని మన నిఘా ఏజెన్సీలు గుర్తించాయి. ఈ సమయంలో భారత్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. తాలిబాన్ నాయకుల మధ్యవర్తిత్వంతో హైజాకర్లు, భారత అధికారుల మధ్య సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు ఇతర అధికారు చర్చల కోసం కాందహార్ వెళ్లారు.
హైజాక్‌కి పాల్పడిన ఉగ్రవాదులు భారత అదుపులో ఉన్న 36 మంది ఉగ్రవాదులతో పాటు చనిపోయిన ఉగ్రవాది సజ్జాద్ ఆఫ్ఘని మృతదేశం, 200 మిలియన్ డాలర్ల డబ్బుని డిమాండ్ చేశారు. అయితే, సజ్జాద్ ఆఫ్ఘనీ శవాన్ని కోరడం ఇస్లామిక్‌కి విరుద్ధమని తాలిబాన్లు చెప్పడంతో హైజాకర్లు వెనక్కి తగ్గారు. చర్చల్లో వారికి కావాల్సిన ముగ్గురు ఉగ్రవాదుల్ని విడుదల చేసేందుకు భారత ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌తో పాటు ముస్తాక్ జర్గర్, ఒమర్ షేక్ ఉన్నారు. జైలులో నుంచి విడుదలైన అజార్ ఆ తర్వాత జైషే మహ్మద్‌ని స్థాపించి 2001 పార్లమెంటు దాడి, 2016 ఉరీ, 2019 పుల్వామా, 2008 ముంబై దాడులు, కాశ్మీర్‌లో అనేక ఘటనలకు కారణమయ్యాడు.
Read Also: CM Chandrababu: మానవ తప్పిదాల వల్లే భారీ వరదలు.. బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి..!
ఉగ్రవాది మృతదేహాన్ని ఎందుకు కోరారు..?
సజ్జాద్ ఆఫ్ఘానీ జూలై 1999లో జమ్మూ లోని అత్యంత భద్రత కలిగిన కోట్ బల్వాల్ జైలు నుంచి పారిపోయే క్రమంలో హతమయ్యాడు. ఇతర ఉగ్రవాదులతో కలసి జైలులో ఏకంగా 23 అడుగుల సొరంగాన్ని తవ్వారు. ఇంకొన్ని అడుగులు అయితే వారు తప్పించుకునే వారే. అయితే జైలు అధికారులు గుర్తించడం, ఆ తర్వాత జరిగిన ఘర్షణలో అతను మరణించాడు.
హర్కత్ ఉల్ అన్సార్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన సజ్జాద్ ఆఫ్ఘానీ, ఆఫ్ఘానిస్తాన్ జిహాద్‌లో కీలకంగా ఉన్నాడు. ఇదే సంస్థకు మసూద్ అజార్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసేవాడు. 994లో అఫ్ఘానీ, అజహర్‌లు అరెస్టయ్యారు. ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి జమ్మూకి అజార్‌ను తరలించిన తర్వాత ఇద్దరూ 1997 నుంచి జమ్మూలోని కోట్ బల్వాల్ జైలులో ఒకే బ్యారక్‌లో ఉన్నారు.
హర్కత్ ఉల్ అన్సార్ అనేది హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ, హర్కత్ ఉల్ ముజాహిదీన్‌ల కలయికతో ఏర్పడింది. పాక్ కేంద్రంగా ఇవి పనిచేసేవి. ఈ బృందం జమ్మూ కాశ్మీర్‌లో కూడా పనిచేసేది. హర్కత్ ఉల్ అన్సార్‌లోని 1000 మంది క్యాడర్‌లో దాదాపుగా 60 శాతం పాకిస్తానీలు, ఆఫ్ఘన్లు ఉండే వారిని నివేదికలు చెబుతున్నాయి. అయితే, భారత సాయుధ దళాలు మౌలానా మసూద్ అజార్ అల్వీ, సజ్జాద్ ఆఫ్ఘనియా మరియు నసరుల్లా మంజూర్ లాంగర్యాల్ (హర్కత్ ఉల్ ముజాహిదీన్ కమాండర్)లను పట్టుకోవడంలో విజయం సాధించాయి.
హైజాక్ కి ముందు హర్కత్ ఉల్ అన్సార్ నాయకుల్ని విడుదల చేసేందుకు అల్ -ఫరాన్ ఢిల్లీలో నలుగురు విదేశీయులను కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అది విఫలమైంది. కాందహార్ హైజాక్ సమయంలో విడుదలైన ఒమర్ సయీద్ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2002లో వాల్ స్ట్రీట్ జర్నల్‌కి చెందిన డేనియల్ పెర్ల్‌ని చంపాడు.1997లో ఒసామా బిన్ లాడెన్‌తో అనుబంధం ఉన్నందుకు హర్కత్ ఉల్-అన్సార్‌పై US నిషేధం విధించింది. ఆ తర్వాత దీని పేరు హర్కత్ ఉల్ ముజాహిదీన్‌గా మార్చబడింది. ఈ గ్రూపుకు చెందిన టెర్రరిస్టులే హైజాకింగ్‌కి పాల్పడ్డారు.