BJP: మహారాష్ట్రలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకోవడానికి శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ నిన్న ఢిల్లీలో పర్యటించారు. కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో శివసేన(యూబీటీ)- కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్ పవార్)ల ‘‘మహా వికాస్ అఘాడీ’’ సంచలన ఫలితాలు సాధించింది. రాష్ట్రంలోని 48 ఎంపీ సీట్లకు గానూ 29 స్థానాలను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలను రిపీట్ చేయాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఠాక్రే ఢిల్లీ పర్యటన సాగినట్లు తెలుస్తోంది.
Read Also: Tihar Prison jailer: తీహార్ జైలర్ ఓవరాక్షన్.. బర్త్ డే పార్టీలో తుపాకీతో డ్యాన్స్
అయితే, ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీ పర్యటనపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఢిల్లీకి వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడని శుక్రవారం విమర్శించింది. ముఖ్యమంత్రి పదవిని మళ్లీ తనకే కేటాయించాలని ఆశించిన ఠాక్రే రిక్తహస్తాలతో తిరిగి రావాల్సి వచ్చిందని బిజెపి రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయే విలేకరులతో అన్నారు. ‘‘ మహారాష్ట్రని మరిచిపోండి, ఠాక్రే తనకు తాను ఏమీ పొందలేకపోయాడు. సీఎం కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఢిల్లీకి వెళ్లాడు. కానీ ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు’’ అని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకుంటామని సీనియర్ కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించిన తర్వాత థాకరే నిరాశ చెందారని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలని మహా వికాస్ అఘాడీగా ఎదుర్కోవాలని కూటమిలోని పార్టీలు ప్రకటించాయి. ఠాక్రే శివసేన(యూబీటీ) ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ముందు పెట్టాడని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. 2019 ఎన్నికల ముందు అమిత్ షా ఠాక్రే నివాసమైన మాతోశ్రీని సందర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో శివసేకు 125 సీట్లను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు 100 సీట్లు కావాలన్నా కాంగ్రెస్ ముందు తలవంచాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.