Bilawal Bhutto: షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ హాజరయ్యారు. దాదపుగా 12 ఏళ్ల తరువాత ఓ పాకిస్తాన్ ప్రతినిధి ఇండియాకు రావడం ఇదే తొలిసారి. భారత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన భారత పర్యటన విజయవంతం అయిందని, పాకిస్తాన్ ఎస్ సీ ఓలో సభ్యదేశం కావడంతో భారత పర్యటనకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆగస్టు 5, 2019న భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే వరకు పాకిస్తాన్, భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను పెట్టుకునే స్థితిలో లేదని ఆయన స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదంపై పాకిస్తాన్ చర్యలు తీసుకునేంత వరకు పాకిస్తాన్ తో సంబంధాలు పెట్టుకోమని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. భుట్టో మాట్లాడుతూ.. ఉగ్రవాదం కొత్తది కాదని, ఈ సవాలును ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ఉగ్రవాదం వల్ల పాకిస్తాన్ చాలా నష్టపోయిందని ఆయన అన్నారు. భారత ఆందోళనలను పరిష్కరించడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని, అయితే భారత్ కూడా పాకిస్తాన్ ఆందోళనల్ని పరిష్కరించాల్సి ఉంటుందని పాక్ జైలులో ఉన్న కుల్ భూషన్ జాదవ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్‌లో రెండు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు.. ఒక ఉగ్రవాది హతం..
2006-14 మధ్య పాకిస్తాన్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, టెర్రర్ ఫైనాన్సింగ్, మనీలాండరింగ్ ను పాకిస్తాన్ అణిచివేసిందని, ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటున్నామని భుట్టో తెలిపారు. ముంబయి దాడుల కేసు విచారణ పాకిస్థాన్‌లో కొనసాగుతోంది. కేసును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సాక్షులను సమర్పించేందుకు భారత్ నిరాకరించడమే విచారణ ముందుకు సాగకపోవడానికి కారణం అని ఆయన ప్రస్తావించారు. కరాచీలో నివసిస్తున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్ కు అప్పగిస్తుందా..? అనే విషయాన్ని దాటవేశాడు.
గిల్గిట్- బాల్టిస్తాన్, పీఓకే నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు కట్టుబడి ఉందని, అయితే ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ జమ్మూ కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణపై ఎందుకు భయపడుతోందని భుట్టో ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదం చాలా క్లిష్టంగా మారిందని ఆయన అన్నారు.