PM Modi: గెలుపోటములు రాజకీయాల్లో భాగమే అని చివరి క్యాబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందు నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న ప్రధాని మోదీ బీజేపీ ఈసారి 240 సీట్లు గెలుచుకుంది . మ్యాజిక్ ఫిగర్ 272 మెజారిటీ మార్కుకు 32 తక్కువ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రస్తుతం అధికారం కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జేడీయూలపై ఆధారపడాల్సి వస్తోంది.
గత 10 ఏళ్లుగా మంచి పనులు చేశాం, మనం దానిని కొనసాగిస్తాము అని ప్రధాని సహచర మంత్రులతో అన్నారు. మరోసారి అధికారం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. ‘‘ గెలుపు ఓటమి రాజకీయాల్లో భాగమని, అంకెల ఆట కొనసాగుతుంది’’ అని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లుగా తమ సేవల్ని అందించిన కేంద్రమంత్రులకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. అంతా కష్టపడి పనిచేశారని కొనియాడారు.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి బిగ్ షాక్..బెయిల్‌ని తిరస్కరించిన కోర్టు..
ఈ సమావేశం తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రధానిగా తన రాజీనామాను రాష్ట్రపతికి అందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. ప్రస్తుతం లోక్‌సభ గడువు జూన్ 16తో ముగుస్తోంది. జూన్ 08న ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 292 స్థానాలు వచ్చాయి. 240 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. మరోవైపు ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ సొంతగా 99 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఫలితాలు ఆ పార్టీని షాక్‌కి గురిచేశాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో రెండు పర్యాయాలుగా అప్రహతికంగా ఫలితాలు సాధిస్తున్న బీజేపీకి ఇండియా కూటమి అడ్డుకట్ట వేసింది. మొత్తం 80 స్థానాల్లో కేవలం బీజేపీ 33 సీట్లను మాత్రమే గెలుచుకోగా.. ప్రతిపక్ష సమాజ్‌వాదీ (ఎస్పీ) 37, కాంగ్రెస్ 06 స్థానాలు సాధించాయి.