ఎంపీలు వరుణ్ గాంధీ, మేనకా గాంధీలకు షాకిచ్చింది భారతీయ జనతా పార్టీ.. 80మందితో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎల్‌కే అద్వానీ, డాక్టర్ మురళీమనోహర్ జోషీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు నేతలకు చోటు దక్కింది. ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి రామ్మోహన్‌రావులకు అవకాశం లభించింది. ఇక, జాతీయ కార్యవర్గ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది, ఎక్స్ అఫిషియో సభ్యులుగా 179 మందిని ఎంపిక చేశారు. ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్‌కు అవకాశం దక్కింది. వచ్చే నెల7న బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది. దాదాపు రెండేళ్ల తర్వాత సమావేశం అవుతోంది.
అయితే, ఎంపీలు వరుణ్ గాంధీ, మేనకా గాంధీలకు బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. వరుణ్ గాంధీ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో పాటు లఖీంపూర్ హింసాత్మక ఘటనలపై తన నిరసన గళం వినిపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేనకా గాంధీ, వరుణ్ గాంధీలను జాతీయ కార్యవర్గ కమిటీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదురు కావొచ్చు.. కానీ, బీజేపీ హై కమాండ్, కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడంతోనే.. వారికి ఈ పరిస్థితి వచ్చిందనే టాక్ నడుస్తోంది.