దేశంలో ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, పోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సహరాన్ పూర్ లో నలుగురు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తను గర్భం దాల్చాలని తెలిసి నలుగురు వ్యక్తులు దాడి చేసినట్లు మహిళ ఆరోపించింది. దీంతో తీవ్ర గర్భస్రావం అయింది. ఈ ఘటనపై 24 ఏళ్ల బాధిత మహిళ దియోబంధ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గురించి శనివారం పోలీసులు వెల్లడించారు.
జనవరి నెలలో తను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఈ అత్యాచారాన్ని మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి, తల్లిదండ్రులతో పాటు ఎవరికైనా చెబితే వీడియోను వైరల్ చేస్తా అని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతటితో ఆగకుండా నిందితుడు, ఆమెను దేవ్ బంద్ లోని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి బందీ చేశాడని.. మరో ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. జూన్ 25న ఆమె, నిందితుల నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చింది. కాగా.. జూన్ 26న నలుగురు వ్యక్తులు ఇంటికి వచ్చి ఆమెపై దాడి చేశారని.. అప్పటికే నాలుగు నెలల ప్రెగ్నెంట్ అయిన సదరు మహిళపై దాడి చేయడంతో గర్భస్రావం జరిగిందని పోలీసులు తెలిపారు.