Tariff On India: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని చెబుతూ అమెరికా 25 శాతం పరస్పర సుంకాలతో పాటు మరో 25 శాతం శిక్షార్హమైన సుంకాలను విధించింది. మొత్తంగా ట్రంప్ సర్కార్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధించింది. అయితే, ఇప్పుడు అమెరికాకు తత్వం బోధపడింది. తాము, సుంకాలతో భారత్‌పై చర్యలు తీసుకున్నా కొద్దీ, రష్యా, చైనాలకు దగ్గర అవుతుందనే భయం అమెరికా పరిపాలనను వెంటాడుతోంది. దీంతో, ఎలాగొలా భారత్‌తో ఈ టారిఫ్స్ వార్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే భారత ప్రధాన ఆర్థిక సలహాదారు వి. ఆనంద నాగేశ్వర్ గురువారం ఉపశమనం కలిగించే విషయం వెల్లడించారు. రాబోయే రోజుల్లో అమెరికా భారత్ పై సుంకాలను ఉపసంహరించుకుంటుందని, పరస్పర సుంకాలను సడలిస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆగస్టులో యూఎస్ విధించిన 25 శాతం శిక్షర్హమైన సుంకాన్ని నవంబర్ చివరి నాటికి విత్ డ్రా చేసుకోవచ్చని అన్నారు. అయితే, ఇది నిర్ధిష్ట ఆధారాలతో చెబుతున్నది కాదని, పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తోందని అన్నారు.
ప్రస్తుతం, మరో 25 శాతం ఉన్న పరిస్పర సుంకాన్ని 10-15 % శాతానికి తగ్గించవచ్చని ఇది తన వ్యక్తిగత అంచనా అని చెప్పారు. భారతదేశ ప్రధాన వాణిజ్య సంధానకర్త, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్, దక్షిణ మరియు మధ్య ఆసియాకు అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్‌ను న్యూఢిల్లీలో కలిసిన కొద్ది రోజులకే ఈ వ్యాఖ్యలు వచ్చాయి. గత నెలలో ట్రంప్ సుంకాలు విధించిన తర్వాత ఇదే ఇరుదేశాల మధ్య తొలి సమావేశం.