Online Love: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి తన ప్రేయురాలిని కలిసేందుకు భారత్-పాక్ సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి వెళ్లి అరెస్ట్ అయ్యాడు. యూపీ అలీగఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఫేస్‌బుక్ ద్వారా పాకిస్తాన్‌కి చెందిన మహిళతో స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం ప్రేమగా మారి సరిహద్దులు దాటేలా చేసింది. ప్రేమించిన యువతిని కలిసేందుకు ఏకంగా పాకిస్తాన్‌లోకి వెళ్లాడు. నాగ్లా ఖట్కారీ గ్రామానికి చెందిన 30 ఏళ్ల బాదల్ బాబుని పాకిస్తాన్ పంజాబ్ పోలీసులు మండి బహౌద్దీన్ నగరంలో అరెస్ట్ చేశారు.
Read Also: March 2024 Movie Roundup: టుస్సాడ్స్ లో అల్లు అర్జున్ మైనపు ప్రతిమ.. నలుగురు హీరోయిన్ల పెళ్లి!
ప్రేమించిన మహిళ కోసం, ఆమెని వ్యక్తిగతంగా కలవాలనే తపనతో వీసా, ప్రయాణ పత్రాలే లేకుండా దేశంలోకి ప్రవేశించినట్లు విచారణలో బాబు ఒప్పుకున్నట్లు పాకిస్తాన్ అధికారులు తెలిపారు. డిసెంబర్ 27న బాబుని అరెస్ట్ చేశారు. అతడిపై పాకిస్తాన్ ఫారినర్స్ యాక్ట్, 1946లోని సెక్షన్ 13 మరియు 14 కింద కేసు నమోదు చేసి, తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. జనవరి 10, 2025న మరోసారి కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది.
యూపీ వ్యక్తి గతంలో రెండు సార్లు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడని ప్రాథమిక విచారణలో తేలింది. మూడో ప్రయత్నంలో సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోని మండి బహౌద్దీన్ చేరుకున్నాడు. అక్కడ తాను ప్రేమించిన మహిళని కలుసుకున్నాడు. అతను పాకిస్తాన్‌కి రావడంలో ప్రేమ కోణం ఉందా..? లేక మరేదైనా విషయం దాగి ఉందా అనే కోణంలో అక్కడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.