ఉత్తర ప్రదేశ్ లో ఆఖరి, చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి విడతలో 9 జిల్లాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. మొత్తం 613 అభ్యర్థులు పోటీలో వున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆఖరి విడతలో బీజేపీ, ఎస్పీ భాగస్వామ్య పక్షాల మధ్య పోటీ వుంటుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 54 స్థానాల్లో 29 స్థానాల్లో విజయం సాధించింది.
ఉత్తర్ ప్రదేశ్ లో అజామ్ గడ్, మౌ, జాన్ పూర్, ఘాజీపూర్, చందోలి, వారణాసి, మీర్జాపూర్, భదోహి, సోన్ భద్ర జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. మూడు రోజుల పాటు వారణాసి లో ప్రచారం చేశారు ప్రధాని మోడీ. సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తన భాగస్వామ్య పక్షమైన “రాష్ట్రీయ లోక్ దళ్” ( ఆర్.ఎల్.డి) అధినేత జయంత్ చౌధురి తో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ తో కలిసి సంయుక్తంగా ర్యాలీ లు నిర్వహించారు.
పూర్వాంచల్ ప్రాంతంలో ప్రచారం చేశారు బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి. యూపీలో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపచేసేందుకు విస్తృతంగా రోడ్ షో లతో పాటు, కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూడా సందర్శించి, పూజలు చేశారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆమె సోదరుడు రాహుల్ గాంధీ. 11 ఎస్.సి స్థానాలు, రెండు ఎస్.టి స్థానాలతో పాటు మొత్తం 54 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన భాగస్వామ్య పక్షాలైన అప్నా దళ్, ఎస్.బి.ఎస్.పి తో కలిసి 29 స్థానాల్లో గెలుపొందగా, సమాజ్ వాది పార్టీ 11 స్థానాలు, బహుజన్ సమాజ్ పార్టీ 6 స్థానాల్లో గెలిచాయి. బీజేపీ భాగస్వామ్య పక్షాలు అప్నాదళ్ (సోనేలాల్), నిషాద్ పార్టీలకు సమాజ్ వాది పార్టీ భాగస్వామ్య పక్షాలైన అప్నాదళ్ (కమేరావాడి), సాహుల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ( ఎస్.బి.ఎస్.పి) లకు ఈ విడత ఎన్నికలు పెద్ద సవాల్ గా భావిస్తున్నారు.
మౌ సదర్ అసెంబ్లీ స్థానం నుంచి ముక్తార్ అన్సారీ కుమారుడు అబ్బాస్ అన్సారి పోటీలో వున్నారు. జహూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి సాహుల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్ భర్ పోటీ చేస్తున్నారు. ఈ విడతలో ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం, ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. ప్రధాన మంత్రి మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోకసభ స్థానం పరిధిలో పోటీ లో ఉన్నారు ముగ్గురు రాష్ట్ర మంత్రులు.
దక్షిణ వారణాసి అసెంబ్లీ స్థానం నుంచి రాష్ట్ర పర్యాటక మంత్రి నీలకంఠ తివారీ, ఉత్తర వారణాసి అసెంబ్లీ స్థానం నుంచి జైస్వాల్ పోటీ చేస్తున్నారు. శివపూర్ అసెంబ్లీ స్థానం నుంచి అనిల్ రాజ్ భర్ పోటీలో వున్నారు. యోగి మంత్రివర్గం నుంచి వైదొలిగి, సమాజ్ వాది పార్టీ లో చేరిన దారా సింగ్ చౌహాన్ మౌ జిల్లాలోని ఘోసి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మార్చి 10 వ తేదీ గురువారం, ఓట్ల లెక్కింపు జరగనుంది. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.