అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో.. ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. మూడు రోజుల్లోనే ఏకంగా ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.. బీజేపీ కూటమి నుంచి 11 మంది ఎమ్మెల్యేలు వైదొలగగా… ఇక, బీజేపీకి చెందినవారే యోగి ఆదిత్యానాథ్ కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారింది.. ఈ పరిణామాలన్నీ ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీకి కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఈ ప్రభుత్వం అబద్దాలకోరు.. ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని అంతా ఆరోపిస్తున్నారు. తాజా పరిస్థితులపై స్పందించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. చాలా లైట్‌గా తీసుకున్నారు.
Read Also: తెలంగాణలో లాక్డౌన్..? క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..
ఉత్తరప్రదేశ్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలు పెద్ద విషయం కాదు అన్నారు నరేంద్ర సింగ్ తోమర్… రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి బీజేపీకి మద్దతు లభిస్తోందన్న ఆయన.. ప్రజలు మమ్మల్ని మరోసారి ఆశీర్వదిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో బీజేపీ విజయం సాధిస్తుంది.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర సింగ్ తోమర్. కాగా, మంగళవారం నుంచి ముగ్గురు మంత్రులతో సహా పది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.. మంత్రిగా ఉన్న మౌర్య నిష్క్రమణతో ఇది ప్రారంభమైంది. అదే రోజున ఆయనకు సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్యేలు – భగవతి సాగర్, రౌషన్ లాల్ వర్మ మరియు బ్రిజేష్ ప్రజాపతి బీజేపీని వీడగా.. మొన్న మరో మంత్రి దారా సింగ్ చౌహాన్, ఎమ్మెల్యే అవతార్ సింగ్ భదానా రాజీనామా చేశారు. ఇక, నిన్న మంత్రి ధరమ్ సింగ్ సైనీ, మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు – వినయ్ షాక్యా, ముఖేష్ వర్మ మరియు బాలా అవస్తి కూడా పార్టీని వీడారు. బీజేపీకి గుడ్‌బై చెప్పిన ముగ్గురు మంత్రులూ కీలకమైన ఓబీసీ వర్గాలకు చెందిన నేతలు.. యోగి సర్కార్ వెనుకబడిన తరగతులను విస్మరించిందని వారు విమర్శలు గుప్పిస్తున్నారు.