Al Falah University: ఢిల్లీ కార్ బాంబ్ పేలుడు ఘటనకు హర్యానా ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు ‘‘వైట్ కాలర్’’ టెర్రర్ మాడ్యూల్‌కి పనిచేశారు. ఎర్రకోట వద్ద కార్ బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న బాంబర్ ఉమర్ కూడా ఈ వర్సిటీలో డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు తేలడంతో ఒక్కసారిగా అల్ ఫలాహ్ పేరు మార్మోగింది. అరెస్టయిన డాక్టర్లకు కూడా ఈ వర్సిటీతో సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు భద్రతా ఏజెన్సీలు, విచారణ అధికారుల కన్ను ఈ యూనివర్సిటీపై పడింది. దీని కార్యకలాపాలు, నిధుల గురించి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Karnataka Congress: సిద్ధరామయ్యనా? డీకే శివకుమారా?.. డిసెంబర్ 1న సీఎం పోస్టుపై నిర్ణయం..
ఇదిలా ఉంటే, అల్ ఫలాహ్ యూనివర్సిటీకి కేవలం 900 మీటర్ల దూరంలో ఒక అండర్ గ్రౌండ్ మదర్సా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ మదర్సా ఫరీదాబాద్‌లోని ధౌజ్‌లోని ఒక గ్రామానికి సమీపంలో పూర్తిగా ఒంటరి ప్రాంతంలో ఉంది. 4000-5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, నేలకు దాదాపుగా 7 అడుగుల దిగువన ఈ మదర్సా ఉంది. ఇప్పుడు ఈ అసాధారణ నిర్మాణం గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మదర్సాకు సంబంధించిన 3 అడుగుల నిర్మాణం మాత్రమే పైన కనిపిస్తోందని, మిగతా భాగం భూగర్బంలో విస్తరించి ఉన్నట్లు తేలింది. సాధారణ మదర్సాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ మదర్సాను మౌలాన ఇష్తేయాక్ పేరుతో నమోదు చేశారు. ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ పేలుడకు కారణమైన ఉగ్రవాది ఉమర్ నబీ సహచరుల్లో ఒకరైన ముజమ్మిల్ షకీర్‌కు ఈ ఇష్తేయాక్ ఒక గదిని అద్దెకు ఇప్పించాడు. ముజమ్మిల్ విచారణలో ఇతడి పేరు బయటపెట్టడంతో అధికారులు ఇష్తేయాక్‌ను అరెస్ట్ చేశారు. మదర్సాకు నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి.?, దీనిని ఎవరు నడిపిస్తున్నారు అనే విషయాలపై విచారణ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.