ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. సామాన్యుడి జీవితం మరింత భారంగా మారనుంది. వంట నూనె, బంగారంతో పాటు చాలా వస్తువుల రేట్లు భారీగా పెరగనున్నాయి.. మన దేశానికి వస్తున్న సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతుల్లో దాదాపు 90 శాతం వరకు రష్యా, ఉక్రెయిన్ల నుంచే దిగుమతి అవుతుంది. దేశంలో ఎక్కువ మంది వాడే వంట నూనెల్లో మొదటి స్థానం పామాయిల్ ఉంటే, రెండో స్థానం సన్ ఫ్లవర్ ఆయిల్ దే. మనం వాడే మొత్తం వంట నూనె ఉత్పత్తుల్లో అరవై శాతం వరకు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో ఎక్కువ భాగం ఉక్రెయిన్, రష్యా దేశాలపైనే ఆధారపడుతున్నాం. దిగుమతుల ద్వారా సమకూర్చుకునే సన్ ఫ్లవర్ ఆయిల్‌లో 70 శాతం ఉక్రెయిన్ నుంచి కాగా, ఇరవై శాతం రష్యా నుంచి దిగుమతి అవుతుంది. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దంతో భారత్ వచ్చే దిగుమతులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. సరిహద్దుల్లో ఉద్రికత్త వాతావరణం మొదలైన తర్వాత ఫిబ్రవరి నెలలో సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి పూర్తిగా నిలిచిపోయింది. లక్షల టన్నుల్లో రావాల్సిన వంట నూనె దిగుమతి నిలిచిపోయింది. ప్రస్తుత పరిస్థితి మరో రెండు మూడు వారాలు కొనసాగితే రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also: Ukraine Russia War: పెట్రోల్‌పై రూ.20, డీజిల్‌పై రూ.15 వడ్డింపు..
మరోవైపు అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర ఇప్పటికే 100 డాలర్లకు చేరింది. గత ఏడు సంవత్సరాల్లో క్రూడాయిల్ రేటు ఇదే గరిష్టం. అటు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. మరి కొన్ని రోజులు ఇదే కొనసాగితే మాత్రం మరింతగా క్రూడాయిల్, బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. గోధుమలను ప్రపంచానికి ఎగుమతి చేసే దేశాల్లో రష్యా అగ్ర స్థానంలో ఉంటే నాలుగో దేశంగా ఉక్రెయిన్ ఉంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా గోధుమల రేట్లు సైతం భారీగా పెరుగుతాయని చెబుతున్నారు. మరోవైపు, ప్రస్తుతం ఒక్కో దేశం టెక్నాలజీ అవసరాలకు కావాల్సిన ప్రత్యేక ముడి సరుకుని అందిస్తుంది. ఫోన్స్ బాడీ తయారీలో వాడే లోహం – పల్లాడియంని రష్యా ఎగుమతి చేస్తుంది. దీన్ని ప్రపంచ దేశాలకు అందిస్తూ అతి పెద్ద ఎగు మతిదారుగా రష్యా ఉంది. ఉక్రెయిన్ పై రష్యా దాడుల కారణంగా రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి, కొన్ని విధించే బాటలో ఉన్నాయి. దీంతో పల్లాడియం దిగుమతులు సైతం తగ్గిపోతే పల్లాడియం ధరలు పెరగనున్నాయి.
ఇండియా ఎగుమతి చేసే ఉత్పత్తుల పై కూడా రెండు దేశాల మధ్య చోటుచేసుకున్న యుద్ధం ప్రభావం చూపనుంది. ఉక్రెయిన్ మీద దాడులు ప్రారంభించిన రష్యాపై అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇండియా అధికంగా టీ పొడిని తయారు చేసి ఇతర దేశాలకు ఉత్పత్తి చేస్తుంది. భారత్ నుంచి టీ అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో రష్యా రెండోది మన దేశం నుంచి టీని ఇతర దేశాలకు చేసే ఎగుమతుల్లో 18 శాతం టీ రష్యా కి ఎగుమతి అవుతుంది. ప్రస్తుత తాజా పరిణామాల నేపథ్యంలో టీ పొడి ఉత్పత్తిదార్లు, ఎగుమతిదార్లలో కలవరం నెలకొంది. రష్యాకు మనదేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల్లో మందుల శాతం అధికంగా ఉంది సుమారు 4వేల 500 కోట్ల విలువైన మందులు ఏటా రష్యాకు ఎగుమతి అవుతున్నాయి. ఇండియాలో ఔషధ కంపెనీలకు ఎన్నో ఏళ్లుగా రష్యా దేశం పెద్ద విపణి. ఉక్రెయిన్ కూడా మందులు ఎగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఒకటి. అయితే ప్రస్తుతం ఆ రెండు దేశాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఎగుమతుల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఎగుమతులు జరిగిన కూడా అంతంతమాత్రమే జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఏదీ ఏమైనా ఉక్రెయిన్,రష్యా యుద్ధం మనదేశంపై తీవ్ర ప్రభావం చూపనుంది.