శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై విరుచుకుపడ్డారు. సీఎం పదవిని బీజేపీ, శివసేన చెరో రెండున్నరేళ్లు పంచుకునేందుకు 2019లో అమిత్ షా అంగీకరించి ఉంటే మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తేదా అని ప్రశ్నించారు. శివసేనలో తిరుగుబాటు, సంకీర్ణ ప్రభుత్వం పతనం, కొత్త సర్కారు ఏర్పాటు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా, శివసేన మిత్రపక్షాలుగా ఎన్నికల్లో గెలిచి, మహారాష్ట్రలో అధికారం చేపట్టిన నాటి సంగతుల్ని గుర్తు చేశారు.
శివసేనలో తిరుగుబాటును.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంగా, ప్రజా తీర్పును కాలరాయడంగా అభివర్ణించారు. 2019 శాసనసభ ఎన్నికల్లో భాజపా, శివసేన కలిసి పోటీ చేసి గెలిచాయి. కానీ సర్కారు ఏర్పాటు విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయాయి. అనంతరం తలెత్తిన రాజకీయ పరిణామాల దృష్ట్యా మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. శివసేనలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో రెండున్నరేళ్లకే కుప్పకూలింది. తనపై ఉన్న కోపాన్ని ముంబయివాసులపై ప్రదర్శించవద్దని కొత్త ప్రభుత్వాన్ని ఉద్ధవ్ ఠాక్రే కోరారు . మెట్రో కార్ షెడ్‌ను ముంబయిలోని కంజూర్‌మార్గ్ నుంచి ఆరే కాలనీకి తరలించాలన్న ఏక్‌నాథ్ సర్కార్ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. పర్యావరణంతో చెలగాటం ఆడకుండా మెట్రో కార్ షెడ్‌ను కంజూర్‌మార్గ్‌లోనే కొనసాగించాలని కోరారు.
2019లో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు హయాంలో ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్.. బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా తీసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆరే కాలనీలో వందలాది చెట్లను నరకాల్సి రావడంతో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పర్యావరణ కార్యకర్తలతో పాటు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాల తర్వాత భాజపాతో తెగదెంపులు చేసుకున్న శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2019 నవంబరులో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెట్రో కార్ షెడ్‌పై ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్‌షెడ్‌ను ఆరే కాలనీ నుంచి కంజూర్‌మార్గ్‌కు తరలించారు. అంతేగాక, ఆరే కాలనీని రిజర్వ్ అటవీ ప్రాంతంగా ప్రకటించారు.
13,000 హెక్టార్లలో విస్తరించి ఉన్నఆరే కాలనీలో 27కి పైగా ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. వివిధ జంతు జాతులు నివసిస్తున్నాయి. సెప్టెంబరు 2019లో బాంబే హైకోర్టు, మెట్రో కార్ షెడ్ నిర్మాణం కోసం ఆరే అటవీ ప్రాంతంలో చెట్లను నరకవద్దని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వాన్ని మౌఖికంగా ఆదేశించింది, దానికి వారు అంగీకరించారు.
Supreme Court: శివసేనకు చుక్కెదురు.. అత్యవసర విచారణకు సుప్రీం ‘నో’