JP Nadda: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఓబీసీ కోటాపై వ్యాఖ్యలు చేశారు. దీనికి బదులుగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ట్యూటర్లు(బోధకులు) కూడా రాహుల్ గాంధీకి సాయం చేయరని అన్నారు. గురువారం రాజ్యసభలో నడ్డా మాట్లాడుతూ.. ‘‘నాయకుడు నాయకుడిగా ఉండాలి, ట్యూటర్లు సాయం చేయరు, ట్యూటర్ల స్టేట్మెంట్లు పనిచేయవు’’ అని అన్నారు.
బుధవారం రాహుల్ గాంధీ పార్లమెంట్ లోక్‌సభలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటాకు డిమాండ్ చేశారు. కులగణన వివరాలను కూడా విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యదర్శులు 90 మంది ఉంటే వారిలో ముగ్గురు మాత్రమే ఓబీసీ వర్గానికి చెందిన వారున్నారని వ్యాఖ్యానించారు.
Read Also: Oscar 2024: దసరా, బలగం సహా అధికారిక ఎంట్రీ కోసం పోటీలో ఉన్న సినిమాలు ఇవే!
రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై తాను షాకైనట్లు నడ్డా ఎద్దేవా చేశారు. బడ్జెట్ లో 5 శాతం మాత్రమే ఓబీసీలకు వెళ్తున్నాయని రాహుల్ వ్యాఖ్యానించడం షాక్ కి గురిచేసిందని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఓబీసీలను పట్టించుకోలేదని అన్నారు. 1992లో సుప్రీంకోర్టు కోరిన తర్వాత సర్వీసుల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేశామని అన్నారు. దేశానికి ఓబీసీ ప్రధానిని (నరేంద్రమోడీ)ని ఇచ్చింది బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాలే అని గుర్తు చేశారు. 303 బీజేపీ ఎమ్మెల్యేల్లో 85 మంది ఓబీసీ వర్గానికి చెందిన వాళ్లు ఉన్నారని తెలిపారు. లోక్‌సభలో కాంగ్రెస్ కు ఉన్న బలం కన్నా బీజేపీ ఓబీసీ ఎంపీల సంఖ్య ఎక్కువని చురకలు అంటించారు.
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశిపెట్టి, ఆమోదింపచేసింది కేందం. మొత్తం ఇద్దరు ఎంఐఎం ఎంపీలు మినహా, 454 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.