Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే జనరిక్ ఔషధాలపై సుంకాలను మినహాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మందులపై పన్నులు విధించాలా? వద్దా? అనే దానిపై నెలల తరబడి చర్చ జరిగిన తర్వాత జనరిక్ ఔషధాలపై సుంకాలను విధించే ప్రణాళికల్ని విరమించుకన్నట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. అయితే, ఈ చర్యలే ఫైనల్ కావని, రాబోయే వారాల్లో ఈ నిర్ణయం మారవచ్చని నివేదిక పేర్కొంది.
అమెరికాలో, జనరిక్ ఔషధాల్లో ఎక్కువ భాగం భారత్ ఫార్మాకు చెందినవే. భారత ఔషధాలకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఒక వేళ సుంకాల నుంచి జనరిక్ డ్రగ్స్‌ను మినహాయిస్తే ఇది భారత్‌కు మంచి పరిణామంగా భావించవచ్చు. ఈ చర్య వల్ల అమెరికన్ ప్రజలకు కూడా భారత జనరిక్ మెడిసిన్స్ సరసమైన ధరలకు లభిస్తాయి. ప్రముఖ వైద్య డేటా విశ్లేషణ సంస్థ IQVIA ప్రకారం, US ఫార్మసీలలో అన్ని జెనరిక్ ప్రిస్క్రిప్షన్లలో భారతదేశం 47 శాతం సరఫరా చేస్తుంది.
Read Also: Nobel Peace Prize: ట్రంప్‌కు నో “నోబెల్”.. స్పందించిన పుతిన్..
గత నెల ప్రారంభంలో, ట్రంప్ అక్టోబర్ 1 నుంచి బ్రాండెడ్ డ్రగ్స్‌పై 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఈ నిర్ణయంలో జనరిక్ ఔషధాలను చేర్చలేదు. ఈ పెంపు ప్రధానంగా ఫైజర్, నోవో నార్డిస్క్ వంటి మల్టీనేషనల్ ఫార్మా దిగ్గజాలు ఎగుమతి చేసే బ్రాండెడ్, పెటెంట్ పొందిన ఔషధాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది.
ట్రంప్ సుంకాల నేపథ్యంలో డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ సభ్యులు జనరిక్ మందులపై సుంకాలు విధిస్తే అమెరికన్లపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఇదే కాకుండా, భారత్ వంటి దేశాల్లో జనరిక్ మందుల తయారీ చాలా తక్కువ ఖర్చుతో జరుగుతుంది. అందువల్ల ఎలాంటి అధిక టారిఫ్స్ విధించినా, అమెరికా ఉత్పత్తి లాభదాయకంగా ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది.
అమెరికా మార్కెట్‌లో భారత ఫార్మా ఎగుమతుల హవా నడుస్తోంది. అమెరికా మార్కెట్ భారత ఫార్మా ఎగుమతుల్లో దాదాపు 3వ వంతు వాటాను కలిగి ఉంది. ప్రతీ ఏడాది 20 బిలియన్ డాలర్ల జనరిక్ మందులు భారత్ నుంచి యూఎస్‌కు ఎగుమతి అవుతున్నాయి. డయాబెటిస్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు.