రేపే వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా.. వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకంగా టికెట్లు తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది టీటీడీ.. రోజుకు రెండు వేల టికెట్ల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతో పాటు రూ.300 దర్శన టికెట్ కొనుగోలు చేయాలి… ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహాలఘు దర్శనం కల్పించనున్నారు.. ఇక, వైకుంఠ ద్వార దర్శనానికి ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. గతంలో కంటే ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా చర్యలు చేపట్టింది.. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు చేసింది.. అర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.. 2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి జరగనుండగా.. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న విధంగానే జనవరి 11 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ..
టీటీడీ ఈవో ఇంట విషాదం..
తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కన్నుమూశాడు.. దీంతో, పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.. తన పెళ్లి శుభలేఖలు పంచడానికి చెన్నై వెళ్లిన చంద్రమౌళి.. తన బంధువుల ఇంట్లో గుండెపోటుకు గురైన విషయం విదితమే కాగా.. ఆ తర్వాత ఆయనను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు.. అయితే, మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చంద్రమౌళి.. ఇవాళ ఉదయం కన్నుమూశారు.. దీంతో, ధర్మారెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది.. చేతికి ఎదిగిన కొడుకు.. ఇలా పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత.. పెళ్లి పీఠలు ఎక్కాల్సిన సమయంలో.. కన్నుమూయడంతో కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబసభ్యులు, బంధువులు.. అయితే, ఇంత విషాద సమయంలోనూ తమ మనవత్వాన్ని చాటుకున్నారు ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు.. కన్నుమూసిన తన కుమారుడు చంద్రమౌళి కళ్లు దానం చేసేందుకు అంగీకరించారు.. ఐ బ్యాంక్‌కి చంద్రమౌళి కళ్లు దానం చేశారు ధర్మారెడ్డి కుటుంబసభ్యులు.
వైసీపీ నేతలకు వార్నింగ్..
పల్నాడు రాజకీయాలు మళ్లీ హీటుపెంచుతున్నాయి.. అయితే, పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్ పుట్టిన రోజు బహుమతిగా మైనారిటీ సోదరుని శవాన్ని గోపిరెడ్డి అందించారని సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. వైసీపీ వచ్చాక మైనార్టీలను ఊచకోత కోస్తున్నారని విమర్శించారు.. ముగ్గురు ఉన్మాదులు పల్నాడును వల్లకాడు చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు.. పిన్నెల్లి, కాసు, గోపిరెడ్డిలని పల్నాడు నుంచి ప్రజలు తన్ని తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు అచ్చెన్నాయుడు.. మాచర్లలో మెన్నటి విధ్వంసం మరువక ముందే పల్నాడులో మరో ముస్లీం కార్యకర్తను పొట్టన పెట్టుకున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు.. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరుడుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన.. వైసీపీ నేతలు కృూర జంతువుల్లా టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకుంటున్నారని.. ఇకనైనా హత్యా రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టకపోతే వైసీపీకి మిగిలేది శంకరగిరి మాన్యాలే అని హెచ్చరించారు. ఇబ్రహీం ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.. ఇబ్రహీం కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అని ప్రకటించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
జగన్ ప్రతీ అడుగులో విశ్వసనీయత..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రస్థానం మొత్తం ముళ్లబాటే అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.. ఈ వేడుకల్లో పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయత ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు.. జగన్ ప్రస్థానం మొత్తం ముళ్లబాటే.. ఆయనతో పాటు కార్యకర్తలు కూడా కష్టాలు పడ్డారన్న ఆయన.. వైఎస్సార్ ఆశయాలు కొనసాగిస్తూ ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు.. తాను నమ్మిన సిద్ధాంతాల ప్రకారం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారని.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా లక్యం వీడకుండా జగన్ ముందుకు సాగుతున్నారని.. జగన్ వేసే ప్రతి అడుగులో విశ్వసనీయత కనిపిస్తుందని వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
సీఎం జగన్‌కు శుభాకాంక్షల వెల్లువ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో.. దేశాల్లోనూ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు.. ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులు సీఎం జగన్‌కు శుభాకాంక్షలు చెప్పారు.. “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు.. ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని ఆక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, వైఎస్ జగన్‌కి నా హృదయపూర్వక అభినందనలు మరియు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా.. ఆ జగన్నాథుడు మరియు వేంకటేశ్వరుడు మీ మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం మీపై వారి ఆశీస్సులు మరియు మీ చైతన్యవంతమైన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పురోగ, శ్రేయస్సు పథంలో నడిపించడానికి మీకు మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను అంటూ గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ విషెస్ చెప్పారు..
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కవిత కౌంటర్
బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ అన్న తొందరపడకు, మాట జారకు అంటూ కవిత ట్వీట్ చేశారు. ఈడీ ఛార్జిషీట్‌లో 28 సార్లు తన పేరు చెప్పించినా.. 28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేసిన సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన 3000 పేజీల ఛార్జిషీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి కవితను ఉద్దేశిస్తూ లిక్కర్ క్వీన్ చేసిన ట్వీట్‌కు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మేం సవాల్ చేసింది ఎప్పుడు?.. మీరు స్పందించింది ఎప్పుడు?
డ్రగ్ పరీక్షకు ఏ శాంపిల్ కావాలన్నా ఇస్తా.. మోడీని ఇమ్మంటా… మరొకరిని ఇమ్మంటా .. ఇస్తారా? అంటూ మంత్రి కేటీఆర్ మంగళవారం బండి సంజయ్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దొంగలు బడ్డ ఆరునెలలకు ఇప్పుడు మొరగడం ఎందుకు అంటూ మండిపడ్డారు. ఎప్పుడో పీసీసీ అధ్యక్షుడు సవాల్ చేస్తే ఇప్పుడు టెస్టులకు రెడీ అంటున్నాడని ఎద్దేవా చేశారు. అన్ని టెస్టులకు ప్రిపేర్ ఆయి టెస్ట్‌కి రెడీ అంటుండు అని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ పేరు మీద కామెంట్ చేయొద్దని ఆర్డర్ తెచ్చాడని ఆయన తెలిపారు. నేను తంబాకు తిన్నట్టు ఆధారాలు ఉన్నాయా.. తాము సంస్కారంగా పెరిగినం మీకు అది లేక ఇలా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాక ముందే ఇలా మాట్లాడితే.. తెలంగాణలో పేదోళ్ల పరిస్థితి దారుణం అవుతుందన్నారు. మీ భాష చూసి నవ్వుకున్నామన్నామని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ భయం మొదలయిందన్నారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసు గుంజితే కొడుకు విషయం తెలుస్తదని విచారణ మూసేశారంటూ ఆరోపించారు. బూతులు తిట్టడం తప్ప ఏముంది మీరు చేసిందంటూ విమర్శించారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు చేయనప్పుడు కోర్టు ముందు నిరూపించుకోవచ్చన్నారు. కేసీఆర్ అభివృద్ధి ఏమి చేసిండో ప్రకటించు అంటూ సవాల్ విసిరారు.
త్వరలో 4,661 నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ రానుంది. రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక సంస్థ త్వరలో 4,661 స్టాఫ్ నర్సుల నియామక ప్రకటన విడుదల చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 31లోపు ఈ నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్ధులు సన్నద్ధమవడానికి వీలుగా కనీసం రెండు నెలల గడువు ఇచ్చే అవకాశం ఉంది. పరీక్షలో వచ్చిన మార్కులు, వెయిటేజీ మార్కులను జోడించి, తుది అర్హులను ఎంపిక చేయనున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియను విజయవంతంగా ముగించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ తదుపరి కార్యాచరణపై దృష్టిపెట్టింది.టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి ఏవైతే.. నిబంధనలను పాటిస్తుందో.. అదే విధానాన్ని స్టాఫ్ నర్సుల నియామకాల్లోనూ అనుసరించాలని వైద్యశాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థను ఆదేశించింది. ఈ మేరకు నర్సుల పోస్టుల భర్తీకి అర్హత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులకు రెండు నెలలు సమయం కూడా ఇస్తారు. బహుళ ఐచ్ఛిక సమాధానాల రూపంలో ప్రశ్నపత్రం రూపకల్పనకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమిస్తారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకన బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
భారత్ జోడో యాత్రకు కోవిడ్ ఎఫెక్ట్
భారత్ జోడో యాత్రపై కూడా కోవిడ్ ఎఫెక్ట్ పడింది. కోవిడ్ ఆందోళనకర పరిస్థితులు ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో సరైన కోవిడ్ మార్గదర్శకాలు పాటించబడుతున్నాయని నిర్ధారించుకోవాలని, కరోనా నిబంధనలను పాటించడం సాధ్యం కాకపోతే, ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యాత్రను మంత్రి నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి కోరారు. గుజరాత్‌లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ఉదహరించింది. రాహుల్ గాంధీ యాత్రకు విపరీతమైన స్పందన రావడంతో పాటు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. మంత్రి మన్సుఖ్ మాండవియా లేఖలో ముగ్గురు రాజస్థాన్ బీజేపీ ఎంపీలు తనకు లేఖలు రాశారని, గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులపై ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. చైనాలో వాస్తవానికి కరోనా విజృభించడంతో ఇతర దేశాలలో ఆందోళనలను రేకెత్తించింది. భారతదేశం గత సంవత్సరంలో చాలా వరకు ప్రోటోకాల్‌ను సడలించింది. అయితే కొన్ని నిబంధనలను మళ్లీ విధించడాన్ని పరిశీలించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశం ఇవాళ జరగనుంది. యాత్ర సమయంలో మాస్కులు, శానిటైజర్ల వాడకంతో సహా కోవిడ్ ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని, టీకాలు వేసిన వారిని మాత్రమే పాల్గొనడానికి అనుమతించాలని రాహుల్ గాంధీని కోరుతున్నట్లు మంత్రి డిసెంబర్ 20 నాటి తన లేఖలో రాశారు. ఇదిలా ఉండగా.. ఇవాళ భారత జోడో యాత్ర రాజస్థాన్ నుంచి హర్యానాలోకి అడుగుపెట్టింది.
అమెరికాలో భూకంపం..
అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూమి కంపించింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఫెర్న్‌డాలేకు 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 16.1 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొంది. భూకంపం ధాటికి హంబోల్డ్‌ట్ కౌంటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందిన అధికారులు తెలిపారు. దీంతో 12 వేల మందికిపైగా అంధకారంలో చిక్కుకుపోయారని చెప్పారు.
జోష్‌లో బాలయ్య ఫ్యాన్స్
బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. కారణం నటసింహం తాజా చిత్రం వీరసింహారెడ్డి నుంచి ఇటీవల రిలీజైన సుగుణ సుందరి పాట ఓ రేంజ్లో దూసుకుపోతుంది. రికార్డు స్థాయిలో ఈ మాస్ బీట్ వ్యూస్ ను రాబడుతోంది. తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్‌ను ప్రకటించారు చిత్ర మేకర్స్. ఈ సినిమా కోసం తమన్ ‘మా బావ మనోభావాలు’ అనే పాటను స్వరపరిచాడు. ఈ పాటను ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం 3:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఈ పాటను కూడా బాలకృష్ణ – శ్రుతి హాసన్ బృందంపై చిత్రీకరించినట్టు తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల సునామీ
దర్శకుడు రాజమౌళి రూపొందించిన చిత్రం ట్రిపుల్ఆర్. ఈ ఏడాది విడుదలైన ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా కలెక్షన్ల పరంగానే కాకుండా అవార్డులు, రివార్డులను సాధిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటివరకు దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ చిత్రం సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్-2022 జాబితాలో 50 ఉత్తమ చిత్రాల్లో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఆస్కార్ నామినేషన్స్ చిత్రాలైన టాప్ గన్ మావెరిక్, టార్‌లను వెనక్కి నెట్టి ముందు నిలబడింది. అదే జాబితాలో చేరిన మరో భారతీయ చిత్రం షౌనక్ సేన్ డాక్యుమెంటరీ ఆల్ దట్ బ్రీత్స్ చిత్రానికి 32వ స్థానం దక్కింది.
తాలిబన్ల కఠిన ఆంక్షలు
ఆఫ్గానిస్థాన్లో ప్రజా ప్రభుత్వం పోయి తాలిబన్లు రాజ్యమేలుతున్నారు. ఈ క్రమంలో వారు మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, బాలికల సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదంటూ మరో వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారు. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమలులో ఉంటుందని తెలిపింది.
అవతార్ 2 రికార్డుల మోత
విజువల్ వండర్ అవతార్ 2 ఈ నెల 16న థియేటర్లకు వచ్చింది. జేమ్స్ కామెరూన్ దర్శకనిర్మాతగా వ్యవహరించిన సినిమా తొలి రోజునుంచే రికార్డులను నమోదు చేసుకుంటూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. టెక్నాలజీ పరంగా ప్రపంచ సినిమాను మరో అడుగు ముందుకు వేయించింది. 2D .. 3D ఫార్మేట్ లలో సినిమా విడుదలైంది. ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 5వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 46 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇలా మొత్తంగా ఐదు రోజుల్లో 497.1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 4110.25 కోట్లు వసూలు చేసి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.