Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ భారత సైనిక సత్తాను పాకిస్తాన్‌కి రుచి చూపించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓకే లోని 09 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి, 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం కవ్వింపుల తర్వాత, 11 పాక్ వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్ కింద భారతదేశం తన వైమానిక దళానికి చెందిన నాలుగు స్క్వాడ్రన్‌లను రంగంలోకి దించింది, వాటిలో బ్రహ్మోస్ మరియు SCALP-EG క్రూయిజ్ క్షిపణులు, AASM హామర్ గైడెడ్ బాంబులు, ఎయిర్ టూ ఎయిర్ వార్‌కి మెటియోర్ క్షిపణులను వాడింది.
అయితే, పాకిస్తాన్ 40 కన్నా ఎక్కువ జెట్స్‌తో భారత దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసింది. వీటికి అమెరికా సరఫరా చేసిన ఎఫ్-16 ఫైటర్స్‌తో పాటు చైనీస్ -10C, JF-17 థండర్ ఫైటర్లను వాడింది. చైనా నుంచి కొనుగోలు చేసిన PL-15E ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులతో పాటు ఫతా-2 రాకెట్లను వాడింది. అయితే, భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ దాడుల్ని అడ్డుకుంది.
చైనీస్ ఆయుధ శిథిలాలపై ప్రపంచం ఆసక్తి..
ఇదిలా ఉంటే, చైనా ఎంతో గర్వంగా చెప్పుకునే PL-15E క్షిపణిని భారత్ కూల్చేసింది. పంజాబ్ హోషియార్‌పూర్ జిల్లాలోని కామాహి దేవి గ్రామంలో దీని శిథిలాలు లభించాయి. క్షిపణి యొక్క ముఖ్యమైన భాగాలు, దాని ప్రొపల్షన్, డేటా-లింక్, ఇనర్షియల్ యూనిట్ మరియు అడ్వాన్స్‌డ్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే (AESA) సీకర్ సహా, చెక్కుచెదరకుండా లభించాయి. ఈ శిథిలాలు ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా, ఫైవ్ ఐస్ నేషన్స్(యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్)తో పాటు జపాన్, దక్షిణ కొరియా దేశాలు PL-15Eలోని డ్యూయల్-పల్స్ మోటార్ మరియు AESA టెక్నాలజీని అధ్యయనం చేయడానికి యాక్సెస్ కోరాయి.
చైనాలో ఆందోళన
చైనా ఆయుధాలు శిథిలాలుగా భారత్‌కి దొరకడంపై చైనా ఆందోళన చెందుతోంది. తన టెక్నాలజీ ఇతర దేశాలకు తెలిసిపోతుందని భయపడుతోంది. భారత రక్షణ శాస్త్రవేత్తలు ఇప్పుడు దీనిని అధ్యయనం చేస్తున్నారు. బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణుల తయారీని బలోపేతం చేయడానికి, ఈ PL-15E క్షిపణిని రివర్స్ ఇంజనీరింగ్ చేసే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు డ్రాగన్ కంట్రీకి గుబులు పుట్టిస్తోంది.
భారత్-పాకిస్తాన్ సంఘర్షణలో చైనా మొదటిసారిగా PL-15E వాడటాన్ని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జాంగ్ జియావోగాంగ్ అంగీకరించారు. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (AVIC) అభివృద్ధి చేసిన PL-15E అనేది దీర్ఘ-శ్రేణి, చురుకైన రాడార్-గైడెడ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి. భారతదేశంలో దాని శిథిలాలను తిరిగి పొందడం వలన సాంకేతిక లీక్‌ల గురించి బీజింగ్‌లో ఆందోళనలు రేకెత్తాయి.