కరోనా మహమ్మారి రూపం మార్చుకుని ఒమిక్రాన్ రూపంలో విస్తరిస్తుండటంతో కఠిన చర్యలు చేపట్టే దిశగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులతో ఆయా రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. ఓవైపు దేశ వ్యాప్తంగా కరోనా నివారణకు టీకా కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నప్పటికీ ముందు జాగ్రత్తగా కోవిడ్ ప్రోటోకాల్స్‌ను ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ లాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే నిర్ణయం తీసుకుని ఒమిక్రాన్ ముప్పును ఎదుర్కొవాలని భావిస్తున్నాయి.
ఇదే క్రమంలో తాజాగా ఒమిక్రాన్ కేసులు వంద దాటిన వేళ మహారాష్ట్ర సర్కార్ ఆంక్షలు విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కన్నా ఎక్కువ మంది ఉండొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇండోర్‌లో జరిగే పెళ్లిళ్లకు 100, ఔట్‌డోర్‌లో జరిగే పెళ్లిళ్లకు 250 మంది కన్నా ఎక్కువ మంది హాజరు కావొద్దని ఆదేశించింది. జిమ్స్, స్పా, థియేటర్లు 50శాతం కెపాసిటీతో నడిపించుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.