Site icon NTV Telugu

Operation Sindoor: “ఆపరేషన్ సిందూర్‌”లో బహవల్పూర్, మురిడ్కే దాడులే హైలెట్..

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు బలిగొన్నారు. అప్పటి నుంచి యావత్ దేశం పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని బలంగా కోరుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉగ్రవాదులు, వారికి మద్దతుదారులు ఎక్కడా ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అందుకు తగ్గట్లుగానే, భారత్ త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్‌కి తగిన బుద్ధి చెప్పాయి. ఏకంగా పీఓకేని దాటి పాక్ లోపలకు వెళ్లి ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిగాయి. మొత్తం 09 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. 80 వరకు ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ మొత్తం దాడుల్లో బహవల్పూర్, మురిడ్కే పై జరిగిన దాడులే హైలెట్‌గా నిలిచాయి. ఈ రెండు కూడా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులో ఉన్నాయి. పీఓకే ప్రాంతాలతో పాటు పాకిస్తాన్ లోపలికి వెళ్లి మరీ భారత్ సైన్యం దాడులు నిర్వహించింది.

బహవల్పూర్:

నిజానికి బహవల్పూర్ పాక్ పంజాబ్ ప్రావిన్స్ దక్షిణ భాగంలో ఉంటుంది. ఇది మన రాజస్థాన్ రాష్ట్రానికి అవతల వైపు ఉంటుంది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్‌పై ఆపరేషన్ సింధూర్ దాడులు జరిగాయి. బహవల్పూర్ జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు హెడ్ క్వార్టర్, దీని చీఫ్ మౌలానా మసూద్ అజార్ స్థావరం. ప్రాంతం ఉగ్రవాదుల కర్మాగారం ఉంది. ఇప్పుడు దీనినే భారత్ టార్గె్ట్ చేసింది. ఈ దాడిలో జైషే ట్రైనింగ్ క్యాంప్, మసీదు వంటివి ధ్వంసమయ్యాయి. మసూద్ అజార్‌కి కుటుంబంలోని అక్క, బావ, మేనల్లుడు, భార్య, మేనకోడలు, వారి ఐదుగురు పిల్లలు మొత్తం 10 మంది హతమయ్యారు. అయితే, 2019 పుల్వామా దాడి సమయంలోనే బహవల్పూర్‌పై ఎయిర్ స్ట్రైక్స్ జరగాల్సి ఉండేది. కానీ, ఆ సమయంలో బాలాకోట్‌ని ఎంచుకుని దాడి చేశారు. ఈ సారి మాత్రం అందుకు మినహాయింపులు ఇవ్వలేదు. టార్గెట్ చేసి జైషే కంచుకోటను బద్ధలు కొట్టారు.

మురిడ్కే:

బహవల్పూర్‌తో పాటు మురిడ్కేపై దాడి భారత సత్తాను చాటింది. ఇది కూడా పంజాబ్ ప్రావిన్సులో ఉత్తర భాగంలో ఉంది. లాహోర్ నగరానికి కొన్ని కి.మీ దూరంలోనే మురిడ్కే ఉగ్ర స్థావరం నెలకొని ఉంది. దీనిపై కూడా భారత్ విరుచుకపడింది. సరిహద్దు నుంచి 25 కి.మీ ఉన్న మురిడ్కేలోని మర్కజ్ తైబా శిబిరం లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం ఉంది. ముంబై ఉగ్రవాదుల్లో పట్టుబడిన అజ్మల్ కసబ్ ఇక్కడే శిక్షణ పొందాడు. డేవిడ్ హెడ్లీ కూడా ఇక్కడే ట్రైనింగ్ అయ్యాడని సమాచారం.

Exit mobile version