The cities with the most CCTV surveillance in the world.. 4 Indian cities in the top 10: ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయిన జనాలు సురక్షితంగా ఉండాలంటే భద్రత, రక్షణ అనేది చాలా ముఖ్యం. నేరాల అదుపు, క్రైమ్ రేట్ తక్కువగా ఉండటం ఆయా ప్రాంతాల అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. శాంతిభద్రతలు సరిగ్గా ఉన్న చోటే పెట్టుబడులు వస్తాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో భద్రతకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఉద్యోగాలు, ఉపాధి పేరుతో చాలా మంది ఇటీవల కాలంలో నగరాల్లోకి మారుతున్నారు. ఇదే విధంగా పెరుగుతున్న జనాభాకు భద్రత కల్పించడం ప్రభుత్వాలకు సవాలుగా మారుతోంది. దీంతో భద్రత, నేరాల అదుపుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు పోలీసులు. భద్రతలో సీసీ కెమెరాల పాత్ర చాలా ముఖ్యం. ఒక్క సీసీ కెమెరా పది మంది పోలీసులతో సమానం. దీంతోనే ప్రభుత్వాలు నగరాలతో పాటు ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
Read Also: Russia-Ukraine War: “చలి”ని ఆయుధంగా చేసుకుంటున్న రష్యా.. జెలెన్ స్కీ ఆరోపణలు
ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా సీసీ కెమెరాల నిఘా ఎక్కువ ఉన్న నగరాల జాబితా వెల్లడయింది. దీంట్లో టాప్ 10 నగరాల్లో నాలుగు భారతీయ నగరాలే ఉన్నాయి. భారత్ నుంచి ఇండోర్, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. ప్రతీ 1000 మందికి ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయనే దాన్ని బట్టి చూస్తే చైనా రాజధాని బీజీంగ్ మొదటి స్థానంలో ఉంది. బీజీంగ్ నగరంలో ప్రతీ 1000 మందికి 372.8 సీసీ కెమెరాలు ఉండగా.. మధ్యప్రదేశ్ నగరం ఇండోర్ 62.52 కెమెరాలతో రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ 41.80 కెమెరాలతో మూడో స్థానంలో, ఢిల్లీ నగరం 26.7 కెమెరాలతో నాలుగో స్థానంలో, చెన్నై 24.53 సీసీ కెమెరాలతో ఐదో స్థానంలో ఉంది. లండన్, బ్యాంకాక్, న్యూయర్క్, ఇస్తాంబుల్, పారిస్, బెర్లిన్ వంటి నగరాలు భారతీయ నగరాల తర్వాతే ఉండటం విశేషం.
ఇండోర్ నగరంలో సుమారుగా 32 లక్షల జనాభా ఉంటే అక్కడ 2 లక్షల వరకు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక ఒక కోటి జనాభా దాటిని హైదరాబాద్ నగరంలో సుమారుగా 4,40,299 కెమెరాలు ఉన్నాయి. 1.60 కోట్ల జనాభా కలిగిన ఢిల్లీలో 4,36,600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కెమెరాలు ఉంటే ఒక్క చైనాలోనే 54 శాతం ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 సీసీ కెమెరాల నిఘా ఉన్న నగరాలు:
చైనా-బీజింగ్: 372.80
ఇండియా-ఇండోర్: 62.52
ఇండియా-హైదరాబాద్: 41.80
ఇండియా-ఢిల్లీ: 26.70
ఇండియా-చెన్నై: 24.53
యూకే-లండన్: 13.35
థాయ్ లాండ్-బ్యాంకాక్: 7.15
టర్కీ-ఇస్తాంబుల్: 6.97
అమెరికా-న్యూయార్క్ సిటీ: 6.87
జర్మనీ-బెర్లిన్: 6.24
ఫ్రాన్స్-పారిస్: 4.04
కెనడా-టొరంటో: 3.05
జపాన్-టోక్యో: 1.06