The Center asked UU Lalit to suggest the name of the next CJI: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీకాలం నవంబర్ 8తో ముగియనుంది. వచ్చే నెల ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోపే కొత్త సీజేఐ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలు ప్రారంభం అయ్యాయి. సీజేఐగా ఉన్న యుయు లలిత్ తన తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును సూచించాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు సమాచారం. భారత 50వ ప్రధాన న్యాయమూర్తి పేరును సూచించాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సీజేఐ యూయూ లలిత్ కు లేఖ రాసింది.
భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఆగస్టు నెలలో యూయూ లలిత్ నియామకం జరిగింది. సాధారణంగా సుప్రీంకోర్టులో ఉన్న ఇతర న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని తరుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. ఈ లెక్కన ప్రస్తుతం సీజేఐగా ఉన్న యూయూ లలిత్ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ ఉన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా తదుపరి చంద్రచూడ్ పదవీ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.
Read Also: BJP Vishnuvardhan Reddy : దేశంలో కేఏ పాల్ పార్టీకి కేసీఆర్ పార్టీకి తేడా లేదు
ఆగస్టు 26న జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేసిన తర్వాత యూయూ లలిత్ బాధ్యతలు చేపట్టారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూయూ లలిత్ చేత సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయించారు. 1983లో న్యాయవాద వృత్తిని చేపట్టిన యూయూ లలిత్ 2004లో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2014లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
తదుపరి న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉన్న డీవై చంద్రచూడ్ 1998లో భారత అదనపు సొలిసిర్ జనరల్ గా పనిచేశారు. 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన 2024 నవంబర్ లో పదవీ విరమణ చేయనున్నారు.