Tejashwi Yadav: మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగబోతోంది. ఇప్పటికే, పాలక బీజేపీ-జేడీయూ కూటమితో పాటు ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ప్రచారాన్ని మొదలుపెట్టాయి., మరోవైపు, కేంద్ర ఎన్నికల సంఘం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ ద్వారా ఫేక్ ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఓటర్ల జాబితాను ఎన్డీయేకు అనుకూలంగా మార్చడానికి ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రాష్ట్ర ఎన్నికలను ప్రతిపక్ష మహాఘట్బంధన్(ఆర్జేడీ-కాంగ్రెస్- వామపక్షాల కూటమి) బహిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ‘‘నకిలీ ఓటర్ల జాబితాను ఉపయోగించి బీజేపీ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే, వారిని నడపనివ్వండి. మొత్తం ప్రక్రియ నిజాయితీ లేనిది, ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటి..? అని తేజస్వీ ప్రశ్నించారు.
Read Also: Rare Earth Elements: దేశంలో 8.52 మిలియన్ టన్నుల ‘‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’’.. చైనా ఆధిపత్యానికి చెక్..
‘‘ఎన్నికలను బహిష్కరించడం అనేది ఒక ఛాయిస్, దీని గురించి మేము ఆలోచిస్తాము. తుది నిర్ణయం తీసుకునే ముందు మా కూటమి భాగస్వాములను, ప్రజలను సంప్రదిస్తాము’’ అని అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రతిపక్షాల ఆందోళనల్ని పరిష్కరించలేదని, నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తోంది, తొలగించి ఓటర్ల గణాంకాలను సుప్రీంకోర్టు ముందు ప్రదర్శించేందుకు బిజీగా ఉందని తేజస్వీ యాదవ్ విమర్శించారు. గతంలో ఓటర్లు ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు, ఇప్పుడు ప్రభుత్వమే ఓటర్లను ఎంచుకుంటోందని ఆయన అన్నారు. ఈ ప్రక్రియ మొత్తం మోసపూరిత ప్రచారమని చెప్పారు.
“బీహార్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు, మరియు దానిని గొంతు నొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈ అంశంపై చర్చను సైలెంట్ చేయాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ చూస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల అవకతవకల ఆరోపణలకు కూడా తేజస్వీ మద్దతు ఇచ్చారు. ఇండియా కూటమి సీట్ల పంపంకం, నాయకత్వ నిర్ణయాలు ఖరారయ్యాని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు.