Taliban: ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఆగస్టు 2021లో ఆఫ్ఘన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత, ఒక తాలిబాన్ మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య జరిగే మొదటి ఉన్నతస్థాయి సమావేశం ఇదే కావడం గమనార్హం.
Read Also: India-China: భారతీయులకు గుడ్‌న్యూస్.. భారత్-చైనా విమాన సర్వీసులు ప్రారంభం ఎప్పుడంటే..!
ముత్తాకి పర్యటన ఒక కీలకమైన దౌత్యపరమైన చర్యను సూచిస్తోంది. భారత్ నిజానికి తాలిబాన్ పాలనను అధికారికంగా గుర్తించనప్పటికీ, సంబంధాలను కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా, ఆఫ్ఘన్ ప్రజలకు మానవతా సాయం అందించడం కొనసాగిస్తోంది. భారత్ ఉగ్రవాదాన్ని, ఆఫ్ఘనిస్తాన్ లోని మహిళలు, మైనారిటీల హక్కులపై తన ఆందోళన నొక్కి చెబుతూనే ఉంది. అయినప్పటికీ, ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం భారత్‌కు మద్దతు తెలిపింది. జైశంకర్, ముత్తాకికి ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం ముత్తాకిపై యూఎన్ భద్రతా మండలి ఆంక్షలు ఉన్నాయి. ప్రయాణనిషేధం కూడా ఉంది. అతను విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక మినహాయింపు అవసరం.
2021లో అమెరికా మద్దతు ఉన్న అష్రఫ్ ఘనీ ప్రభుత్వంపై తాలిబాన్‌లు తిరుగుబాటు చేసి, అధికారాన్ని చేపట్టారు. తాలిబాన్ పాలను అధికారంగా గుర్తించిన తొలి దేశంగా రష్యా నిలిచింది. ఆఫ్ఘన్ వ్యాప్తంగా భారత్ భారీ పెట్టుబడులు పెట్టింది. మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, ఆస్పత్రుల్ని కట్టించింది.