Baba Ramdev Controversy: ‘మహిళలు తనలాగా దుస్తులు వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు’ అంటూ యోగా గురు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో పలు చోట్ల ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ.. రామ్‌దేవ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ సైతం దేశ మహిళలకు సారీ చెప్పాలని రామ్‌దేవ్‌ని ట్విటర్ మాధ్యమంగా అడిగారు. ‘‘మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ ఎదుట రామ్‌దేవ్ మహిళల్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవి, ఖండించదగినవి. ఆయన ప్రసంగంతో మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విషయంపై రామ్‌దేవ్ క్షమాపణలు చెప్పాలి’’ అని ట్వీట్ చేశారు.
తెలంగాణలోనూ రామ్‌దేవ్ వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నిరసన నిరసనలు చేసింది. నిరసనకారులు రామ్‌దేవ్ బాబా దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ నిరసనల్లో మాజీ మంత్రి గీతారెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అటు.. సీపీఐ నారాయణ సైతం రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. మహిళల గురించి రామ్‌దేవ్ చాలా అన్యాయంగా మాట్లాడారన్న ఆయన.. అలాంటి వ్యాఖ్యలు చేసిన టైంలో, అక్కడే ఉన్న మహిళలు అతన్ని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాల్సిందని మండిపడ్డారు. యోగా పేరుతో కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. దేశంలో చాలా చోట్ల మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల మహిళా విభాగాలు రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
కాగా.. ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వందలమంది మహిళలు విచ్చేశారు. అయితే.. వారిలో చాలామందికి చీరలు ధరించే సమయం దొరక్కపోవడంతో, శిబిరానికి సాధారణ దుస్తుల్లోనే వచ్చేశారు. ఇది గమనించిన రామ్‌దేవ్.. మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్ – సూట్స్‌లో కూడా బాగానే కనిపిస్తారన్నారు. అక్కడితో ఆగకుండా.. తనలాగా దుస్తులు వేసుకోకుండా అందంగానే కనిపిస్తారని రామ్‌దేవ్ బాంబ్ పేల్చారు. ఈ కామెంట్‌పై రామ్‌దేవ్ పక్కనే ఉన్న అమృతా, కార్యక్రమానికి వచ్చిన మహిళలు నవ్వడం ఆశ్చర్యకరం.
महाराष्ट्र के उपमुख्यमंत्री जी की पत्नी के सामने स्वामी रामदेव द्वारा महिलाओं पर की गई टिप्पणी अमर्यादित और निंदनीय है। इस बयान से सभी महिलाएँ आहत हुई हैं, बाबा रामदेव जी को इस बयान पर देश से माफ़ी माँगनी चाहिए! pic.twitter.com/1jTvN1SnR7
— Swati Maliwal (@SwatiJaiHind) November 26, 2022