మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతోంది. తాజాగా ‘మహ’ పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరింది. రెబెల్ వర్గం శివసేన ఎమ్మెల్యేలు 16 మందిపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏక్ నాథ్ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. దీంతో పాటు సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అజయ్ చౌదరిని నియమించడాన్ని, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ పై అవిశ్వాసాన్ని తిరస్కరించడాన్ని ఏక్ నాథ్ షిండే వర్గం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. తమ కుటుంబాలకు భద్రత కల్పించేలా మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వారు కోర్టును కోరారు.
తిరుగుబాటు చేసిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ శివసేన ఈ వారం ప్రారంభంలో డిప్యూటీ స్పీకర్ ను కోరింది. అనర్హత అసెంబ్లీకి సంబంధించిన విషయాల్లో మాత్రమే జరగుతుందని.. పార్టీ సమావేశానికి హాజరుకాకపోవడం వల్ల జరగదని షిండే వర్గం పేర్కొంటోంది. అయితే ఈ అంశంపై నేడు సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో అని అందరిలోను ఉత్కంఠత నెలకొంది. సుప్రీంకోర్టులో రెబెల్ ఏక్‌నాథ్ షిండే శిబిరం తరఫున హరీశ్ సాల్వే , కపిల్ సిబల్ ఉద్ధవ్ ఠాక్రే, ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్నారు. కాగా స్పీకర్ ఉత్తర్వుల ప్రకారం సోమవారం సాయంత్రానికి అనర్హత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తమ వాదనలను స్పీకర్ కు తెలియచేయాలి.
ఇదిలా ఉంటే శివసేనకు చెందిన 56 మంది ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే వర్గంలో ఏకంగా 39 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 8 మంది మంత్రులు ఉండటం గమనార్హం. అయితే పార్టీని సొంతం చేసుకోవడానికి మూడింట రెండు వంతుల మెజారీటి తమ వద్ద ఉందని ఏక్ నాథ్ షిండే వర్గం చెబుతోంది. ఇదిలా ఉంటే రెబెల్ వర్గం తమను ‘ శివసేన బాల్ సాహెబ్ ఠాక్రే’ వర్గం పిలుచుకుంటుంది. దీనిపై ఉద్ధవ్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇటీవల జరిగి జాతీయ కార్యవర్గం సమావేశంలో బాల్ ఠాక్రే పేరు ఉపయోగించవద్దని తీర్మాణం కూడా చేసింది.