న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇవ్వడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. దర్యాప్తు సంస్థలు న్యాయవాదులకు సమన్లు జారీ చేయకూడదని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్.గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Bihar Elections: ‘సంకల్ప్ పత్ర’ పేరుతో కోటి ఉద్యోగాల హామీ ఇచ్చిన ఎన్డీఏ
ఇద్దరు న్యాయవాదులకు ఈడీ సమన్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు విచారించింది. నిందితుడి తరపున వాదించిన న్యాయవాదిని గుజరాత్ పోలీసులు పిలిచిన తర్వాత కేసును న్యాయస్థానం సుమోటాగా స్వీకరించింది. ఈ పరిణామం న్యాయవాద వృత్తి స్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తుందని.. అంతేకాకుండా న్యాయ నిర్వహణపై ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేవలం అసాధారణ పరిస్థితిలో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. బీఎస్ఏ సెక్షన్ 132 కింద అసాధారణ పరిస్థితిలో మాత్రమే న్యాయవాదులను పిలవాలని స్పష్టం చేసింది. క్లయింట్లకు ఇచ్చే సలహాలపై న్యాయవాదులను ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలేవి కూడా పిలవకూడదని ఆదేశించింది. నిందితుల తరఫున హాజరయ్యే న్యాయవాదులకు ఎట్టి పరిస్థితుల్లో సమన్లు జారీ చేయొద్దని సూచించింది. అలాగే న్యాయవాది నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజ్ కూడా కోర్టు ముందు మాత్రమే తెరవాలని ఆదేశించింది. ఇక ఈ పరిణామాన్ని న్యాయస్థానంతో పాటు బార్ కౌన్సిల్ కూడా తీవ్రంగా ఖండించింది. న్యాయవాదులకు ఈడీ సమన్లు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: నెహ్రూ వల్లే ఆ సమస్య వచ్చింది.. కాంగ్రెస్‌పై మండిపడ్డ మోడీ
ఇటీవల చీఫ్ జస్టిస్ గవాయ్ ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమయ్యాయి. విష్ణువు విగ్రహంపై గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అలాగే విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు.. భారత రాజ్యాంగం బుల్డోజర్ వ్యవస్థతో సాగదని వ్యాఖ్యానించారు. గవాయ్ చేసిన వ్యాఖ్యలు కొన్ని వర్గాలను నొప్పించడంతో ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో గవాయ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా న్యాయవాదులకు సమన్లు జారీ చేయొద్దని ఆదేశించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఒక న్యాయమూర్తి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో భారీగా నోట్ల కట్టలు దొరికాయి. ఈ వ్యవహారంలో న్యాయమూర్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దారి తీసింది.