Supreme Court: పహల్గామ్ ఉగ్రవాదిలో 26 మంది టూరిస్టులు చనిపోయిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇండియాలో ఉంటున్న పాకిస్తానీలు దేశం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాక్ జాతీయులు వీసాలను రద్దు చేసింది. అయితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జన్మించిన ఒక వ్యక్తిని, అతడి కుటుంబ సభ్యుల బహిష్కరణపై సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించింది.
బెంగళూర్‌లోని యాక్సెంచర్‌లో పనిచేస్తున్న అహ్మద్ తారిఖ్ బట్ అనే వ్యక్తిని, అతడి ఆరుగురు కుటుంబ సభ్యులు ‘‘పాక్ వెళ్లాలనే’’ ఆదేశాలపై సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తనకు భారతీయ పాస్‌పోర్టు, ఆధార్ కార్డ్ కూడా ఉన్నాయని, అయినప్పటికీ పాకిస్తాన్ వెళ్లిపోవాలని ఆదేశించారని కోర్టుకు చెప్పాడు. కోర్టు పత్రాల ధ్రువీకరణకు ఆదేశించింది. అప్పటి వరకు అతడిపై ఎలాంటి బలవంతంపు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీచేసింది. హైకోర్టుని ఆశ్రయించాలని బట్‌ని సుప్రీంకోర్టు కోరింది. అయితే, ఈ ఉత్తర్వులను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తరుపు న్యాయవాది సవాల్ చేశారు. కానీ ఈ విషయంలో సుప్రీంకోర్టు ‘‘కొంత మానవీయ కోణాన్ని’’ వ్యక్తం చేసింది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో జన్మించిన అహ్మద్ తారిక్ బట్, తన కుటుంబాన్ని బలవంతంగా అట్టారి వాఘా బోర్డర్‌కి తీసుకెళ్తున్నారని వాదించాడు. ‘‘మేము మొత్తం ఆరుగురు సభ్యులం. ఇద్దరు సోదరులు బెంగళూర్‌లో పనిచేస్తు్న్నారు. తల్లిదండ్రులు, సోదరి, మరో సోదరుడు శ్రీనగర్లో ఉన్నారు’’ అని అతను చెప్పాడు. తారిఖ్ ఐఐఎం కోజికోడ్ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఐటీ కంపెనీ యాక్సెంచర్‌లో పనిచేస్తున్నాడు.
మీరు ఎలా భారత్ వచ్చారు..?
శుక్రవారం విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, అహ్మద్ తారిక్ బట్‌ని భారత్ ఎలా వచ్చారని ప్రశ్నించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని మీర్పూర్‌లో జన్మించిన భట్, తన తండ్రిలో కలిసి 1997లో భారత్ వచ్చానని చెప్పాడు. శ్రీనగర్ చేరుకున్న తర్వాత తాము పాకిస్తాన్ పాస్‌పోర్టుని జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు అప్పగించామని, ఆ తర్వాత భారత్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. ఆ తర్వాత తన కుటుంబ సబ్యులు మూడు సంవత్సరాల తర్వాత 2000లో శ్రీనగర్ వచ్చారని చెప్పారు. ప్రతీ ఒక్కరి కూడా భారత్ పౌరసత్వం, పాస్‌పోర్టు ఉన్నాయని కోర్టుకు వెల్లడించారు.
అయితే, ఈ డాక్యుమెంటేషన్, కుటుంబ సభ్యులందరం ఆధార్ కార్డులు కలిగి ఉన్నామని, అయినప్పటికీ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని, నోటీసుల్లో తాము వీసాలపై భారత్‌లోకి ప్రవేశించి, వీసా గడువు ముగిసిన తర్వాత ఇక్కడే ఉంటున్నామని తప్పుగా పేర్కొన్నట్లు బట్ చెప్పారు.