Supreme Court On shivsena party issue: మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కొనసాగుతోంది. అసలైన శివసేన ఎవరిదనే ప్రశ్నకు ఇక కేంద్ర ఎన్నికల సంఘమే సమాధానం ఇవ్వనుంది. తాజాగా సుప్రీంకోర్టులో మాజీ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బ తాకింది. శివసేన పార్టీపై ఇటు ఏక్ నాథ్ షిండే వర్గం, అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే తాజాగా మంగళవారం రోజు ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఉద్దవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాల్లో ఎవరిది అసలైన శివసేన అని గుర్తించే అవకాశం ఎన్నికల సంఘానికే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విల్లు, బాణం గుర్తు ఎవరికి చెందుతుందో తేల్చేది ఇక ఎన్నికల సంఘమే అని సుప్రీంకోర్టు తెలిపింది. నిజమైన శివసేన గుర్తింపు కోసం షిండే వర్గం వేసిన పిటిషన్ పై ఎన్నికల సంఘం విచారణను నిలిపి వేయాలని ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. అయితే దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉద్దవ్ ఠాక్రే వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల సంఘం విచాణకు స్టే ఇవ్వాలని కోరుతూ ఉద్దవ్ ఠాక్రే వర్గం పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.
Read Also: EAM Jaishankar: సిక్కు మహిళ కిడ్నాప్, మతమార్పిడి.. పాకిస్తాన్‌కు ఇండియా స్ట్రాంగ్ మెసేజ్
ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు ఏక్ నాథ్ షిండేకు గొప్ప ఊరటగా పేర్కొనవచ్చు. ఏక్ నాథ్ షిండే వర్గానికి పెద్ద విజయంగా భావిస్తున్నారు. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఏక్ నాథ్ షిండేకు మద్దతుగా ఉన్నారు. లోక్ సభలో మెజారిటీ ఎంపీలు కూడా ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వైపే ఉన్నారు. దీంతో శివసేనపై ఏక్ నాథ్ షిండే ఆధిపత్యమే అధికంగా ఉంది. దీంతో అసలైన శివసేన ఎవరిదనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం విచారించనుంది.
శివసేనలో కీలక నేతగా ఉన్న మంత్రి ఏక్ నాథ్ షిండే.. మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలతో సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. గౌహతిలో క్యాంప్ రాజకీయాలు చేశారు. దీంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయింది. శివసేన వర్గంతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా ఏక్ నాథ్ షిండే బాధ్యతలు తీసుకోగా.. దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు.