supreme court on PM Security Breach Case: ఈ ఏడాది పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెక్యూరిటీ వైఫల్యం తలెత్తింది. పంజాబ్ ఫిరోజ్ పూర్ పర్యటనలో ఉండగా.. పంజాబ్ ప్రభుత్వం తగిన భద్రత కల్పించలేదనే విమర్శలు వచ్చాయి. ప్రధాన మంత్రి వంటి హైప్రొఫైల్ వ్యక్తి కాన్వాయ్ కొంతసేపు ఓ ఫ్లై ఓవర్ పై నిలిచిపోయింది. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఈ విషయం విచారణ కోసం రైటైర్డ్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో ఐదుగురు కమిటీ సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
తాజాగా గురువారం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. జస్టిస్ ఇందు మల్హోత్రా కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు నివేదికలోని అంశాలను చదివి వినిపించింది. ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీ శాంతిభద్రతల పరిరక్షణలో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిండంతో విఫలం అయ్యారని నివేదిక వెల్లడించింది. ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీ వద్ద తగినంత బలగాలు ఉన్నప్పటికీ.. ప్రధాని ఆ మార్గంలో వస్తారని 2 గంటల ముందు తెలియజేసినప్పటికీ సెక్యూరిటీని అరెంజ్ చేయడంతో విఫలం అయ్యారని నివేదికలోని అంశాలు సుప్రీంకోర్టు చదివింది.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ప్రధానమంత్రి భద్రతను పటిష్టం చేయడానికి పరిష్కార మార్గాలను సూచించింది. నివేదికను ప్రభుత్వానికి పంపి చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఏడాది జనవరి 5 ప్రధాని పంజాబ్ పర్యటనకు వెళ్లినప్పుడు పలువురు రైతులు ఆందోళనలు చేసి రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో ప్రధానమంత్రి కన్వాయ్ కొంత సేపు ఓ ఫ్లై ఓవర్ పై నిలిచిపోయింది. తరువాత ఈ ఘటనలో ఖలిస్తానీ ఉగ్రసంస్థ హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు కురపించింది. కావాలనే పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధానిని అవమానపరిచిందని బీజేపీ ఆరోపించింది.