Supreme Court: గురుద్వారాలో ప్రవేశించడానికి, పూజ చేయడానికి నిరాకరించిన క్రైస్తవ ఆర్మీ అధికారిని తొలగించిన కేసును సుప్రీంకోర్టు విచారించింది. ‘‘అతను ఆర్మీకి పనికి రాడు’’ స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. అతడిని అసమర్థుడిగా ముద్ర వేసింది. తన తొటి సిక్కు సైనికులు విశ్వాసాన్ని గౌరవించనందుకు అతడిని తొలగించిన ఆర్మీ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ‘‘అతను ఎలాంటి సందేశం పంపుతున్నాడు.? ఒక ఆర్మీ అధికారి చేసిన తీవ్రమైన క్రమశిక్షణారాహిత్య చర్య. అతడిని తొలగించాలి. ఇలాంటి వ్యక్తులు సైన్యంలో ఉండటానికి అర్హులా.?’’ అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను అత్యుత్తమ అధికారి కావచ్చు కానీ, అతను భారత సైన్యానికి సరిపడడు అని చెప్పింది.
Read Also: Karregutta: కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న CRPF భద్రత బలగాలు!
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 3వ అశ్వికదళ రెజిమెంట్‌లో గతంలో లెఫ్టినెంట్‌గా ఉన్న శామ్యూల్ కమలేషన్‌ను సైనిక క్రమశిక్షణను ధిక్కరించినందుకు తొలగించారు. పూజ నిర్వహించడానికి గురుద్వారాలోకి ప్రవేశించాలని తన ఉన్నతాధికారి ఆదేశాలను పట్టించుకోకుండా, తిరస్కరించాడు. ఇది తన క్రైస్తవ ధర్మాన్ని ప్రభావితం చేస్తుందని వాదించాడు. మే నెలలో ఢిల్లీ హైకోర్టు ఈ కేసును విచారించింది. కమలేసన్ తన ఉన్నతాధికారి నుంచి వచ్చిన ఆదేశాల కన్నా, మతాన్ని ఎక్కువగా చూస్తున్నారని, ఇది స్పష్టంగా క్రమశిక్షణారాహిత్య చర్య అని తీర్పు చెప్పింది. ఇది సైనిక ధర్మాన్ని ఉల్లంఘించడమే అని చెప్పింది.
సుప్రీంకోర్టు కూడా ఇదే తరహా తీర్పును వెల్లడించింది. కమలేషన్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ , కీలక వ్యాఖ్యలు చేసింది. కమలేసన్ తరుపున న్యాయవాది గోపాల్ శంకరనారాయణ వాదించారు. కమలేసన్ హోలీ, దీపావళి వంటి పండగల్లో పాల్గొనడం ద్వారా ఇతర మతాల పట్ల గౌరవాన్ని ప్రదర్శించారని అన్నారు. అతను గురుద్వారా వెలుపల ఉండీ చేయాల్సింది అంతా చేశాడని, కానీ గురుద్వారాలోకి ప్రవేశించడం తన విశ్వాసానికి విరుద్ధమని వారితో చెప్పాడని శంకరనారాయణ కోర్టుకు తెలిపారు. తన ఉన్నతాధికారి తోనే కమలేసన్‌కు సమస్య ఉందని చెప్పాడు. అయితే, సుప్రీంకోర్టు ఈ వాదనలతో ఏకీభవించలేదు.