ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పరీక్షల కాలం నడుస్తోంది. ఫైనల్ ఎగ్జామ్స్ కోసం విద్యార్థులంతా సిద్ధపడుతున్నారు. ఇంకోవైపు ఫీజుల కోసం యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. పూర్తి ఫీజు చెల్లిస్తేనే పరీక్షలు రాయిస్తామని.. లేదంటే రాయిపించమని బెదిరిస్తున్నారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఈ పరిణామాలు ఒక విద్యార్థిని మనసును తీవ్రంగా కలిచివేసేసింది. యాజమాన్యాల క్రూరత్వానికి.. ఓ తల్లికి గర్భశోకాన్ని ముగిల్చింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
కేవలం అంటే కేవలం రూ.800 స్కూల్ ఫీజు చెల్లించలేదని తొమ్మిది తరగతి విద్యార్థినిని పరీక్ష రాయకుండా స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది. సంవత్సరమంతా కష్టపడి చదివి.. చివరి ఎగ్జామ్ రాయనివ్వకపోవడంతో విద్యార్థిని తీవ్రంగా కలత చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రతాప్‌గఢ్ జిల్లాలోని జెత్వారాలో చోటుచేసుకుంది. పొలం నుంచి ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు… కుమార్తె విగతజీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఈ ఘటనపై బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.1,500 చెల్లించానని. ఇంకా రూ.800 చెల్లించాల్సి ఉందని తెలిపింది. కానీ స్కూల్ యాజమాన్యం పరీక్ష రాయకుండా అడ్డుకున్నారని.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని పేర్కొంది. పాఠశాల మేనేజర్ సంతోష్ కుమార్ యాదవ్, పాఠశాల అధికారి దీపక్ సరోజ్, ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ యాదవ్, ఇతరులు బహిరంగంగా అవమానించి పరీక్ష రాయనివ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. అవమానం భరించలేకే తమ కుమార్తె ప్రాణాలు తీసుకుందని.. దీనికి కారకులైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత తల్లి ఫిర్యాదులో పేర్కొంది.
బాలల ఆత్మహత్యకు లేదా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 107 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై స్థానిక పంచాయతీ సభ్యుడు, న్యాయవాది మహ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ.. బాలిక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యాపారం చేస్తున్న యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ దుర్గేష్ సింగ్ తెలిపారు.