Supreme Court: భర్తలకు తమ భార్యలు తీసుకువచ్చిన స్త్రీధనంపై నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆపద సమయాల్లో వాటిని ఉపయోగించినప్పటికీ, అది స్త్రీలకు చెందిన సంపూర్ణ ఆస్తిగా మిగిలిపోతుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఒక మహిళ పోగొట్టుకున్న బంగారానికి బదులుగా రూ.25 లక్షలు చెల్లించాలని ఒక వ్యక్తిని కోర్టు ఆదేశించింది. భర్తలు తమ భార్యలకు ‘స్త్రీ ధన్’ని తిరిగి ఇవ్వా్ల్సిన నైతిక బాద్యతను ఎత్తి చూపింది.
తన వివాహం సమయంలో తన కుటుంబం 89 సవర్ల బంగారం గిఫ్టుగా ఇచ్చిందని, తన తండ్రి రూ. 2 లక్షల చెక్కుని తన భర్త బహుమతిగా ఇచ్చారని మహిళ పేర్కొంది. అయితే, తన బంగారు ఆభరణాలన్నింటిని తన భర్త స్వాధీనం చేసుకుని, భద్రపరిచే నెపంతో అతని తల్లికి ఇచ్చాడని చెప్పింది. అయితే, తన భర్త, అత్తగారు వారి ఆర్థిక సమస్యలను తీర్చుకోవడానికి తన బంగారాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది.
Read Also: Delhi High Court: భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందని తప్పుడు ఆరోపణలు చేయడం మానసిక క్రూరత్వమే..
2011లో కుటుంబ న్యాయస్థానం ఈ కేసును విచారించి మహిళ బంగారు ఆభరణాలని భర్త, అతని తల్లి దుర్వినియోగం చేశారని సదరు మహిళకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, మహిళ తన వాదనల్ని రుజువు చేయలేదని పేర్కొంటూ కేరళ హైకోర్టు ఈ నిర్ణయాన్ని పాక్షికంగా రద్దు చేసింది. స్త్రీధనం అనేది మహిళ ఆస్తిగా మిగిలిపోతుందని, దానిపై భర్తకు నియంత్రణ ఉండదనే సూత్రాన్ని సమర్థిస్తూ ఆ మహిళ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. వివాహంలో నమ్మకం, పరస్పర అవగాహన అవసరమని, మొదటి నుంచి స్త్రీ తన భర్తను విశ్వసించలేదని భావించడం అసంభవమని కోర్టు పేర్కొంది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం విమర్శించింది. పెళ్లి ఫోటోలను చూస్తే సదరు మహిళ అత్తగారింటికి తగినంత నగలను తీసుకువచ్చినట్లు పేర్కొంది. కాలక్రమేణా జీవన వ్యయం పెరుగుదలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, 2009లో రూ. 8.90 లక్షల విలువైన 89 సవర్ల బంగారానికి బదులుగా మహిళకు రూ. 25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.