Delhi High Court: భార్యభర్తలు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని తప్పుడు ఆరోపణలు చేయడం, పిల్లలను తల్లిదండ్రులు నిరాకరించడం తీవ్ర మానసిక క్రూరత్వమే అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. తన భార్య క్రూరత్వానికి పాల్పడిందనే కారణంతో భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ని ఫ్యామిలీ కోర్టు తిరస్కరించడాన్ని సమర్థిస్తూ జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది.
జీవిత భాగస్వామిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, ముఖ్యంగా ఆమె క్యారెక్టర్, విశ్వసనీయను అనుమానించడం, పిల్లలు తనకు పుట్టలేదని తిరస్కరించడం తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తుందని, వివాహ బంధాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తుందని కోర్టు పేర్కొంది. ఇలాంటి చర్యలు అవమానం, క్రూరత్వం యొక్క తీవ్ర రూపాన్ని సూచిస్తాయని, ఈ కారణాలపై విడాకులు పొందేందుకు సదరు వ్యక్తికి అర్హత లేదని బెంచ్ పేర్కొంది.
Read Also: Nose Pin: ప్రమాదవశాత్తు “ముక్కుపుడక”ను పీల్చుకున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
విచారణ సమయంలో.. తన భార్య అనేక మంది పురుషులతో సంబంధం కలిగి ఉందని భర్త పదేపదే ఆరోపించారు. అయితే, ఆమె, ఇతర పురుషులతో అలాంటి పరిస్థితుల్లో చూడలేదని క్రాస్ ఎగ్జామినేషన్‌లో అంగీకరించాడు. భర్త, తన భార్యపై ప్రతీసారి మొండిగా నిరాధారమైన, ఖండించదగిన ఆరోపణలు చేశాడని, ఆమెకు అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని నిరూపించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. భర్త కనికరం లేకుండా కించపరిచే స్వభావాన్ని, అతని ఆరోపణల్ని న్యాయమూర్తులు విమర్శించారు.
‘‘పిల్లలు నాకే చెందుతారనే నమ్మకం లేదు’’ అని చెప్పడం అమాయకపు పిల్లల్ని లక్ష్యంగా చేసుకోవడమే అని కోర్టు చెప్పింది. ఇలాంటి దుర్భరమైన ఆరోపణలు, వివాహ బంధాన్ని తిరస్కరించడం, అమాయకపు పిల్లలను అంగీకరించడానికి నిరాకరించడం తీవ్రమైన మానసిక క్రూరత్వ చర్య తప్ప మరొకటి కాదని కోర్టు పేర్కొంది. భర్త ఆరోపణలు భార్య క్యారెక్టర్, గౌరవం, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన దాడిగా ఫ్యామిలీ కోర్టు సరిగ్గానే గుర్తించిందని హైకోర్టు పేర్కొంది. భర్త క్రూరత్వాన్ని భరిస్తూ కూడా విడాకుల రద్దు నిర్ణయాన్ని సమర్థించింది భార్యే అని బెంచ్ నిర్ధారించింది. ఈ కేసులో భార్య క్రూరత్వాన్ని అనుభవించింది, భర్త కాదని చెప్పింది.