Mohan Bhagwat: భాషా వివాదాల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భాష, కులం, సంపద వంటి భేదాలను పక్కనపెట్టి సామాజక సామరస్యతను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతీ వ్యక్తి తన ఇంట్లో తప్పనిసరిగా మాతృభాష మాట్లాడాలని, అలాగే ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు ఆ ప్రాంతాల భాషను నేర్చుకోవాలని అన్నారు. భారత్ లోని అన్ని భాషలకు సమాన గౌరవం ఉందని ఆయన అన్నారు.
హిందీని తమపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారంటూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలువురు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా సోన్‌పెయిరి గ్రామంలో జరిగిన ‘హిందూ సమ్మేళన్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోహన్ భగవత్ చేసిన ఈ వ్యాఖ్యల్ని పలువురు బీజేపీ నేతలు సమర్థించారు. భారతీయ గుర్తింపు సమగ్రతను ఈ వ్యాఖ్యలు చూపిస్తున్నాయని అన్నారు. దేశ సంస్కృతి అనేది అందరిని కలుపుకునేదాని చెప్పారు. వందేమాతరం పలికే ప్రతీ ఒక్కరూ కూడా భారతీయులే అని, నిజమైన అర్థంలో హిందువులే అని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.
అయితే, భగవత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు బీజేపీని టార్గెట్ చేశాయి. భగవత్ ఎవరి సిద్ధాంతాలను సూచిస్తున్నారని ప్రశ్నించారు. ఆయన మాటల్ని మొదటగా ఎవరు పాటించాలి? ఆయన సిద్ధాంతాలు ఎవరిని సూచిస్తున్నాయి.? ఏ రాజకీయ పార్టీ ఆయన నుంచి స్పూర్తి పొందుతుంది? అది బీజేపీనే కదా? అని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు.