Sonia Gandhi to travel abroad for medical check-ups: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. సోనియా వెంట రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ కూడా వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మంగళవారం తెలిపింది. అయితే వారి పర్యటనకు సంబంధించిన తేదీలను వెల్లడించలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధం అవుతోంది. పెరుగుతున్న ధరలకు నిరసనగా సెప్టెంబర్ 4న కాంగ్రెస్ ‘మెహంగై పర్ హల్లా బోల్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో’ యాత్ర జరగనుంది. బీజేపీ అవలంభిస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఈ యాత్ర చేయనున్నారు. ఈ బిజీ షెడ్యూల్ ఉన్న క్రమంలోనే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ విదేశాలకు వెళ్తున్నారనే వార్త వెలువడింది. అయితే ఏ తేదీన వెళ్తారనే దానిపై స్పష్టత లేదు.
Read Also: Ajay Mishra: రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి..
ఇక కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో సతమతం అవుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీలోని తన పదవులకు రాజీనామా చేశారు. ఇదే దారిలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కీలక నేతగా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆనంద్ శర్మ, హిమాచల్ ప్రదేశ్ పార్టీ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ఎన్నికలు ఉన్న సమయంలో ఆయన రాజీనామా పార్టీకి ఎదురుదెబ్బే.
సోనియాగాంధీ కోవిడ్ 19కి పాజిటివ్ బారినపడ్డారు. ఆ సమయంలో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం సోనియాగాంధీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో సమావేశం అయ్యారు.